Idream media
Idream media
టీఆర్‌ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా నేతలు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. గులాబీ శ్రేణుల సందడితో మాదాపూర్ హెచ్‌ఐసీసీలో పండగ వాతావరణం ఏర్పడింది. సుమారు మూడువేల మంది టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేశారు. నిర్ణీత సమాయానికి సభాస్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్ తన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
ప్రపంచంలోనే గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశం, వసతులు, వనరులు భారతదేశానికి ఉన్నా.. వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేకుండా పోయాయని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశ లక్ష్యమంటే ప్రజల సామూహిక లక్ష్యం అయి ఉండాలని, దేశ నలుమూలల ప్రజలకోసం ఒకలక్ష్యం, దిశ, గమ్యం ఉండాలని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం దేశం లక్ష్యం దిశగా పయనించడం లేదన్నారు. దేశాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యామ్నాయ ఎజెండా కావాలన్నారు. ఇందుకోసం అవసరమైన సమయంలో తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.
కేసీఆర్ అధ్యక్షతన దాదాపు తొమ్మిది గంటలపాటు సాగిన ప్రతినిధుల సభ.. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలనా వైఫల్యాలను సరిదిద్ది, తెలంగాణ తరహాలో దేశాన్ని గాడిలో పెట్టడానికి జాతీయ స్థాయిలో రాజకీయ నాయకత్వం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ను ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్.. సృష్టికర్తలని ఉద్ఘాటించారు.
దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినదించారు. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ క్రియాశీలక పాత్రను ఖాయం చేశారు. అయితే కొత్త ఫ్రంట్ ఏర్పాటు ఉండబోదన్నారు. హైదరాబాద్ వేదికగా దేశానికి కొత్త ఎజెండా రూపుదిద్దుకుంటే చాలా సంతోషం అన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం మొత్తం కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేశారు. గవర్నర్ తమిళిసై పేరు ప్రస్తావించకుండా.. దేశంలో గవర్నర్ వ్యవస్థ దిగజారుతోందంటూ ఘాటైన విమర్శలు చేశారు.
టీఆర్‌ఎస్‌కు 90 స్థానాలు
‘‘ప్రజలు సునిశితంగా అన్ని విషయాలు గమనిస్తారు. ఎవరో ఆరోపణలు చేస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉండాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా టీఆర్‌ఎస్ పార్టీయే గెలుస్తోంది. అందులో ఎవరికీ అనుమానం అవసరంలేదు. సాంకేతికపరమైన విషయాలను అవగాహన చేసుకోవడానికి కన్సల్టెన్సీని పెట్టుకున్నాం. వాళ్లు చేసిన సర్వేలు మనం 90కి పైచిలుకు స్థానాల్లో అలవోకగా గెలుస్తామని చెబుతున్నాయి.’’ అని పేర్కొన్నారు.