Idream media
Idream media
తెలంగాణ గవర్నర్ తమిళి సై ఇప్పటికీ బీజేపీ నేతగానే వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ మంత్రులు ఇటీవల తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు. గతంలో సీపీఐ నారాయణ లాంటి వాళ్లు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు తమిళి సై ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తున్నారు. టీఆర్ ఎస్ మంత్రుల ఆరోపణలకు కూడా ఆమె సమాధానం ఇచ్చారు. బాధ్యతాయుతంగా తన కర్తవ్యం నిర్వహిస్తున్నానని, రాజ్యాంగబద్ధంగా పని చేస్తున్నానని పేర్కొన్నారు. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో ఆమె బీజేపీ నాయకుల పోస్టులకు లైకులు కొట్టడం, కామెంట్లు చేయడంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమిళి సై సౌందర్ రాజన్ గవర్నర్ కాకముందు భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగారు. తమిళనాడు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె 18 ఫిబ్రవరి 2021న బాధ్యతలు చేపట్టారు. హుజూరాబాద్ ఎన్నికల ముందు వరకూ సర్కారుకు, గవర్నర్ కు మధ్య సయోధ్య ఉండేది. ఏమైందో ఏమో కానీ..ఇటీవల కాలంలో తెలంగాణ సర్కారు, గవర్నర్ ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు కూడా ఈ పంచాయతీ చేరింది. మోడీని కలిసి వచ్చాక తమిళి సై మరింత దూకుడు పెంచారు.
తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియామకం వెనుక పొలిటికల్ గేమ్ ఉందని మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. ఈ రాష్ట్రంపై దృష్టిపెట్టిన బీజేపీ ప్రభుత్వం దానిలో భాగంగానే తమిళనాడు అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను ఇక్కడ గవర్నర్ గా నియమించిందని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. తమిళి సై రాజ్యాంగ బద్ధమైన పదవిలోకి వచ్చాక అందుకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. కానీ.. ఇటీవల టీఆర్ ఎస్ మంత్రులు ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. బీజేపీకి మేలు చేసేలా నడుచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఆమె బీజేపీని పాలో అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు బీజేపీ మహిళా నేతల సమావేశ చిత్రాలను, పదవి పొందిన బీజేపీ ఎంపీలకు శుభాకాంక్షలు చెప్పడం, అలాగే పలువురి నేతల కామెంట్లను, బీజేపీ కార్యకర్తలతో మోడీ భేటీ వంటి చిత్రాలను లైక్ చేస్తుండడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.