Idream media
Idream media
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులపై టీవీ ఛానళ్లలో చర్చలు నిర్వహించడం, న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకోవడమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా నేరానికి సంబంధించిన అన్ని అంశాలను, ఏది సంపూర్ణ సాక్ష్యమో తేల్చాల్సింది కోర్టే తప్ప ఛానళ్లు కాదని పేర్కొంది. ఒక దోపిడీ-హత్యకు సంబంధించి దిగువ కోర్టు నిందితులకు విధించిన ఉరిశిక్షను కర్ణాటక హైకోర్టు తగ్గించి జీవిత ఖైదు విధించింది. దీనిపై నిందితులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ పి.నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి మంగళవారం తీర్పు వెలువరించింది. నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో కొన్ని అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని.. వీటిని గుర్తించి చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ‘పిటిషనర్లు (నిందితులు) స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలను డీవీడీలో రికార్డు చేశారు. దీనిని దిగువ కోర్టు ముందు ప్రసారం చేశారు. కోర్టు తుది తీర్పునకు ఇదే ఆధారంగా మారింది. అయితే ఈ వాంగ్మూలం పోలీసు అధికారి ముందు ఇచ్చినట్లుగా ఉంది. సాక్ష్యాధారాల చట్ట నియమాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా సదరు డీవీడీలోని వాంగ్మూలాలను ‘ఉదయ టీవీ’ నిర్వహించే ‘పుట్ట మట్ట’ కార్యక్రమంలో ప్రసారం చేశారు.
‘ఈ డీవీడీని బహిరంగంగా ప్రసారం చేసేందుకు వీలుగా ప్రైవేటు టీవీ ఛానల్ చేతుల్లో పెట్టడం.. విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం చూపడమే. కోర్టుల న్యాయ పరిపాలనలో నేరుగా జోక్యం చేసుకోవడమే. క్రిమినల్ కేసు వ్యవహారాలు, సాక్ష్యాలకు సంబంధించి విచారించవలసింది కోర్టులు. బహిరంగ వేదికల్లో ఇలాంటివి చేయకూడదు. కేసులో నిజానిజాలు తెలుసుకోవడం వరకే పరిమితం కాకుండా దర్యాప్తు సంస్థలు నిందితుల వాంగ్మూలం మొత్తం రికార్డు చేయడం సబబు కాదు. ఇలాంటి ధోరణికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. నిందితులకు ఇతర కేసుల్లో ప్రమేయం ఉన్న విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ప్రాసిక్యూషన్ భావిస్తే.. సంబంధిత కేసుల చార్జిషీట్లను, దోషులుగా నిర్ధారించిన కోర్టు తీర్పులు లేదా ఆదేశాలను న్యాయస్థానానికి సమర్పించి ఉండాలి. ఇతర నేరాల్లో వారి ప్రమేయం ఉందన్న రికార్డు ఆధారంగా దిగువ కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది. దీనిని ఆమోదించడానికి వీల్లేదు. కేవలం సందర్భోచిత సాక్ష్యం ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సంశయ లాభం కింద నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం. ఇతర కేసుల్లో వారి కస్టడీ అవసరమనుకుంటే తప్ప.. వారిని విడుదల చేయాలి’ అని తీర్పులో ఆదేశించింది.