ప్రపంచ క్రికెట్ చరిత్రలో మిస్టర్ కూల్ ఎవరు? అంటే క్రికెట్ గురించి తెలిసిన ఏ వ్యక్తి అయిన వెంటనే మహేంద్ర సింగ్ ధోని అని చెప్తాడు. అంతలా వరల్డ్ క్రికెట్ పై తన కూల్ కెప్టెన్సీ ముద్రను వేశాడు ఈ జార్ఖండ్ డైనమైట్. అయితే టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం ధోని కాదు.. అతడే అసలైన మిస్టర్ కెప్టెన్ కూల్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి సునీల్ గవాస్కర్ చెప్పిన ఆ మిస్టర్ కూల్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేంద్ర సింగ్ ధోని.. క్రీడా పండితులు, అభిమానులు ముద్దుగా ‘మిస్టర్ కెప్టెన్ కూల్’ అని పిలుచుకుంటారు. దానికి కారణం ధోని మైదానంలో వ్యవహరించే తీరే. గ్రౌండ్ లో ఎంత ఒత్తిడి ఉన్నాగానీ.. ప్రశాంతంగా జట్టును ముందుండి నడిపిస్తాడు. బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చినా.. ఆటగాళ్లు క్యాచ్ లు మిస్ చేసినా ధోని కోప్పడిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. అందుకే అతడికి మిస్టర్ కెప్టెన్ కూల్ అనే బిరుదును ఇచ్చారు అభిమానులు. అయితే టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం మిస్టర్ కెప్టెన్ కూల్ ధోని కాదని, భారతదేశానికి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవే అసలైన ఒరిజినల్ మిస్టర్ కెప్టెన్ కూల్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇండియాకు వరల్డ్ కప్ వచ్చి సరిగ్గా 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. 1983 వరల్డ్ కప్ నాటి సంఘటనలను గుర్తు చేశాడు సునీల్ గవాస్కర్.
ఈ క్రమంలోనే కపిల్ దేవ్ ను అసలైన మిస్టర్ కెప్టెన్ కూల్ గా అభివర్ణించాడు గవాస్కర్. 1983 వరల్డ్ కప్ లో ఆల్ రౌండర్ గా అదరగొట్టాడు కెప్టెన్ కపిల్ దేవ్. ఇక ఫైనల్ మ్యాచ్ లో విండీస్ దిగ్గజం వివి రిచర్డ్స్ క్యాచ్ ను అద్భుతంగా ఒడిసిపట్టిన తీరు ఎవరూ మర్చిపోలేరు. ఇక కపిల్ దేవ్ ఎవరైనా ఫీల్డర్ క్యాచ్ మిస్ చేసినా.. బౌలర్ పరుగులు ఎక్కువ ఇచ్చినా.. ప్రశాంతంగా నవ్వుతూ ఉండేవాడని గవాస్కర్ గుర్తు చేశాడు. అందుకే నా దృష్టిలో అసలైన మిస్టర్ కెప్టెన్ కూల్ కపిల్ దేవ్ అంటూ చెప్పుకొచ్చాడు.