Idream media
Idream media
శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి.మోయలేని భారంగా మారిన నిత్యావసరాల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరలు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైఫల్యంపై లక్షలసంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాల్సిన పరిస్థితి తలెత్తింది. పాలకుల పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు.ప్రజలకు రక్షణ,శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారు. తాజాగా.. శ్రీలంకలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఎగసిపడుతున్న నిరసనల హోరుతో అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష కాస్త దిగొచ్చినట్లే కనిపిస్తున్నారు.
కొత్తగా ఆయన నియమించిన 17 మందితో కూడిన క్యాబినెట్లో కుటుంబసభ్యులకు చోటు కల్పించలేదు. దీంతో.. గొటాబయ కుటుంబం నుంచి ఆయన సోదరుడు ప్రధాని మహింద రాజపక్ష మాత్రమే ప్రస్తుతానికి క్యాబినెట్లో మిగిలారు. దేశంలో నెలకొన్న ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. రాజపక్ష ప్రభుత్వంపై ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు గొటాబయ, ప్రధాని మహింద రాజీనామా చేయాలంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి. అయినా దిగిరాని అధ్యక్ష, ప్రధానులు.. రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పేశారు. కాకపోతే.. తమ క్యాబినెట్‌తో మాత్రం రాజీనామా చేయించారు. అయినా నిరసన సెగలు ఆగకపోవడంతో.. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు క్యాబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించకపోవడంతో.. ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో.. తాజాగా 17 మంది మంత్రులను క్యాబినెట్లోకి తీసుకున్నారు.
అయితే.. కుటుంబసభ్యులను మాత్రం దూరంపెట్టారు. గత క్యాబినెట్లో మంత్రులుగా చేసిన గొటాబయ మరో సోదరుడు చమల్ రాజపక్ష, మహింద రాజపక్ష కుమారుడు నమల్ రాజపక్ష, మేనల్లుడు శశీంద్రలకు ఈ క్యాబినెట్లో చోటు దక్కలేదు. కాగా.. దేశంలో రసాయన ఎరువుల వినియోగాన్ని నిషేధిస్తూ 2020లో తాను తీసుకున్న నిర్ణయంపై అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష విచారం వ్యక్తం చేశారు. తాను అప్పుడు ఆ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఇందువల్లే దేశంలో వ్యవసాయం దెబ్బతిందని, ఆహార ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అంతర్జాతీయ ఆర్థిక నిధి (ఐఎంఎఫ్)ను ఉద్దీపన ప్యాకేజీ కోసం ముందుగానే అభ్యర్థించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సోమవారం కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.