iDreamPost
android-app
ios-app

శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం..

శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకం..

దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్టు బోర్డు నియామకం జరిగింది. శ్రీ కాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 మంది సభ్యులతో ట్రస్టు బోర్డు నియామకం జరిగింది. అంజూరు తారక శ్రీనివాసులును ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. అత్యంత మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తించేందుకు అటు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు గానీ చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

చిత్తూరు జిల్లాలో తిరుమల తర్వాత శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఖ్యాతి గాంచింది. నిత్యం వేలాది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఏకైక వాయు లింగేశ్వర క్షేత్రం ఇది. రాహు-కేతు పూజ కోసం దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆలయం కావడంతో భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యవేడుకు చెందిన మాజీ ఎంపీటీసీ బీరేంద్రవర్మను ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించారు. అయితే ఆయన బాధ్యతలు కూడా తీసుకోలేదు.

స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తమ నియోజకవర్గానికి చెందిన వారినే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించాల్సిందిగా పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో బీరేంద్ర వర్మను రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించి వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు కు ఆలయ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. జిల్లా వైసీపీ బీసీ అధ్యక్షులు మిద్దిల హరి పేరు కూడా పాలక మండలి చైర్మన్ రేసులో తెరమీదకు వచ్చినా చివరకు అంజూరు తారక శ్రీనివాసులుకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి దక్కింది.