iDreamPost
android-app
ios-app

అఖిలేష్‌కు అర్థం అయిందా..?

అఖిలేష్‌కు అర్థం అయిందా..?

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో వివిధ మీడియా, సర్వే సంస్థలు అంచనా వేసి చెప్పాయి. దాదాపు అన్ని సంస్థలు బీజేపీనే గెలుస్తాయని చెప్పాయి. గతంకన్నా బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయని, ఎస్పీకి మరికొన్ని సీట్లు అదనంగా వస్తాయని అంచనా వేశాయి. బీజేపీకి 250–280 మధ్య, ఎస్పీకి 100–130 మధ్య సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఇక బీఎస్పీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఎప్పటి మాదిరిగానే ఉందని తెలిపాయి. బీఎస్పీ 15–20, కాంగ్రెస్‌ 5–10 సీట్లు గెలుచుకుంటుందని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో అంచనా వేశాయి.

ఈ నెల 10వ తేదీన (గురువారం) ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే ఫలితాలకు రెండు రోజుల ముందే ఉత్తరప్రదేశ్‌లో ఎవరు గెలవబోతున్నారో అర్థమైంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలే నిజం కాబోతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.

తుది విడత పోలింగ్‌ ముగిసిన ఈ నెల 7వ తేదీ రాత్రి 7 గంటలకు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వచ్చాయి. మరుసటి రోజు.. అంటే 8వ తేదీ సాయంత్రం అఖిలేష్‌ ఎన్నికల సంఘం అధికారులపై చేసిన విమర్శలు.. ఈ ఎన్నికల్లో తన పార్టీ ఓడిపోబోతోందనే సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల సంఘానికి చెందిన కొంతమంది అధికారులు.. ఈవీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నారని అఖిలేష్‌ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ అఖిలేష్‌ ఈ ఆరోపణలు చేయడం, ఆ తర్వాత కొద్ది సమయానికే ఎస్పీ కార్యకర్తలు వారణాసిలోని ఈవీఎం స్టోరూం వద్ద ఆందోళనకు దిగడం గమనార్హం.

ఈ పరిణామాలు సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి సూచికలుగా కనిపిస్తున్నాయి. ఫలితాలు రాకముందే.. అఖిలేష్‌ యాదవ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఓటమిని ఆయన ఊహించినట్లుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితే 2019లో ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగింది. 2019 ఎప్రిల్‌ 11వ తేదీన పోలింగ్‌ జరగ్గా.. రెండో రోజున టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి.. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారంటూ ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి వరకు గెలుస్తామని అనుకున్న తెలుగు తమ్ముళ్లకు విషయం అర్థమైంది. ఫలితాలు రాక ముందే చంద్రబాబు ఓటమిని ఒప్పుకున్నారు. వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కొన్నినెలల పాటు ఈవీఎంలను ట్యాపరింగ్‌ చేయడం ద్వారా గెలిచారంటూ టీడీపీ నేతలు మాట్లాడారు. ఇదే విధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోనూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతున్నారు. మరి ఫలితాలు ఎలా వస్తాయో రేపు గురువారం తేలిపోతుంది.