iDreamPost
android-app
ios-app

బలహీనంగా ఉన్నామని వారే ఒప్పుకుంటున్నారేమి..?

బలహీనంగా ఉన్నామని వారే ఒప్పుకుంటున్నారేమి..?

కిందపడినా పైచేయి మాదేననేలా రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. అలా ఉండడం చాలా అవసరం. కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా, ప్రత్యర్థుల గెలుపును తేలిగ్గా తీసుకునేలా రాజకీయనేతలు కొన్ని ప్రకటనలు చేస్తుంటారు. నైతిక విజయం మాదేనని, వారిది అసలు గెలుపు కానేకాదని, ఈ సారి అధికారంలోకి వస్తామనే ప్రకటనలు చేస్తుంటారు. పార్టీ కుప్పకూలిపోయినా.. అధికారంలోకి వస్తామనే ప్రకటనలు తరచూ చేస్తుంటారు. ఏపీలో టీడీపీ నేతలు తమకు ఈ సారి 160 సీట్లు వస్తాయని, ఏపీలో రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటనలు చేయడం ఈ కోవలోకే వస్తాయి.

సాధారణంగా రాజకీయ పార్టీలు, నేతలు పైన పేర్కొన్న విధంగా ఉంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఇందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఉండడం గమనార్హం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు వరుసగా రెండు ఎన్నికల్లోనూ పరాభవం ఎదురైంది.మరో ఏడాదిన్నరలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లోనైనా తాము గెలుస్తామనే ధీమా కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యక్తం చేయకపోతుండడం విశేషం. వారికి వారే తమ పార్టీ బలంగా లేదని చెబుతూ హస్తం పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్లు పరిణామాలు ఉన్నాయి.

తాజాగా రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. బీజేపీ కన్నా వెనుకబడి ఉందన్నట్లుగా వీహెచ్‌ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. ‘‘తెలంగాణలోని పరిణామాలను సోనియా గాంధీ పరిగణలోకి తీసుకోవాలి. సీనియర్లను పిలిచి మాట్లాడాలి. పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్‌ పార్టీ వినియోగించుకోవాలి. టీఆర్‌ఎస్, బీజేపీల కంటే మెరుగైన కార్యక్రమాలను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టాలి’’ అంటూ వీహెచ్‌ హనుమంతరావు డిమాండ్‌ చేయడం గమనించాల్సిన అంశం.

పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్‌ పార్టీ వినియోగించుకోవాలి, టీఆర్‌ఎస్, బీజేపీల కంటే మెరుగైన కార్యక్రమాలను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టాలని వీహెచ్‌ హనుమంతరావు అనడంతోనే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థమవుతోంది. టీఆర్‌ఎస్‌ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌ పార్టీ వినియోగించుకోవడం లేదని వీహెచ్‌ స్పష్టంగా చెబుతున్నారు. అదే సమయంలో టీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌ పార్టీ కంటే మెరుగైన కార్యక్రమాలను చేపడుతున్నాయని వీహెచ్‌ తన వ్యాఖ్యల ద్వారా ఒప్పుకుంటున్నారు. ఓ పక్క ఏపీలో హస్తం పార్టీ అడుగంటిపోయినా.. ఇక్కడ నేతలు మేము అధికారంలోకి వస్తామంటూ ప్రకటనలు చేస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మాత్రం.. టీఆర్‌ఎస్, బీజేపీల కన్నా కాంగ్రెస్‌ వెనుకబడి ఉందని చెబుతుండడం విడ్డూరంగా ఉంది.