చిన్నమ్మకు అవకాశం దొరికింది..!

ఇటీవల విడుదలైన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర ఓటమిని చవిచూసింది. అధికార డీఎంకే పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ప్రభావం అన్నాడీఎంకేపై పడింది. సరైన నాయకత్వం లేకపోవడంవల్లనే ఇలాంటి ఫలితాలు వచ్చాయనే భావన అన్నాడీఎంకే నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకుని మళ్లీ పార్టీలో చేరి,పట్టుసాధించేందుకు శశికళ రంగంలోకి దిగారు. ఈ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఈ పర్యటనలో పార్టీలోని ప్రతి కార్యకర్తను కలిసేలా శశికళ వ్యూహరచన చేశారు. తద్వారా పార్టీలో చేరడానికి ఉన్న అడ్డంకులను అధిగమించవచ్చని శశికళ భావిస్తున్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందే శశికళ జైలునుంచి విడుదల అయ్యారు. అన్నాడీఎంకేలో కీలకప్రాత పోషించేందుకు యత్నించారు. అయితే ఆమె ఆశలు ఆడియాశలయ్యాయి. చివరికి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్నికలకు ముందు ప్రకటించారు. శశికళ రాకవల్ల గ్రూపు రాజకీయాలు మొదలవుతాయని,అంతిమంగా అన్నాడీఎంకేకు నష్టం జరుగుతుందనే కారణంతో.. ఆమెను బీజేపీ పెద్దలు నిలువరించారని అందరూ భావించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు శశికళ ప్రకటించారు. అన్నాడీఎంకేలో చేరేందుకు యత్నించగా.. మాజీ సీఎంలు పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంలు ఆమె రాకను అడ్డుకున్నారు. అయితే చిన్నమ్మ మాత్రం అన్నాడీఎంకే జెండాను వదలలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిని తానే అనేలా లెటర్‌ హెడ్‌పై ప్రకటనలు జారీ చేస్తున్నారు.

శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు శశికళను.. పళని స్వామి, పన్నీర్‌ సెల్వంలు పార్టీలో రాకుండా అడ్డుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. జయలలిత లేకుండా జరిగిన ఎన్నికల్లో.. అన్నాడీఎంకే చతికిలపడుతుందని అందరూ ఊహించారు. కానీ పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం ద్వయం నేతృత్వంలోని అన్నాడీఎంకే మంచి ఫలితాలు సాధించింది. అధికారం కోల్పోయినా.. చెప్పుకోదగ్గ సీట్లను సాధించింది. 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో.. డీఎంకే 125 సీట్లు గెలవగా.. అన్నాడీఎంకే 65 సీట్లు గెలుచుకుంది. మిగిన సీట్లు ఇతర పార్టీలు సొంతం చేసుకున్నాయి.ఈ ఫలితాల తర్వాత పళనిస్వామి,పన్నీర్‌ సెల్వంల నాయకత్వం పై కార్యకర్తల్లో అనుమానాలు తొలగాయి.

అయితే ఈ పరిస్థితిని మున్సిపల్‌ ఎన్నికలు పూర్తిగా మార్చివేశాయి. మొత్తం 21 కార్పొరేషన్లకు గానూ డీఎంకే 21ని కైవసం చేసుకుంది. 138 మున్సిపాలిటీల్లో 132 చోట్ల జెండా ఎగురవేసింది. 489 టౌన్‌ పంచాయతీలకు గాను అధికార పార్టీ 435 చోట్ల విజయబావుటా ఎగురవేసింది. అన్నాడీఎంకే కేవలం మూడు మున్సిపాలిటీలు, 15 టౌన్‌ పంచాయతీలకు మాత్రమే పరిమితమైంది. అన్నాడీఎంకే కు కంచుకోటగా ఉన్న కొంగు మండలంలోనూ డీఎంకే విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. చిన్నమ్మ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. అయితే శశికళ పర్యటన విజయవంతం కాకుండా ఉండేందుకు పళనిస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలు ఎవరూ ఆమెను కలవొద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో..శశికళ జిల్లాల పర్యటన ఎలా సాగుతుంది..? మళ్లీ చిన్నమ్మ పార్టీపై పట్టుసాధిస్తారా ..? అనే అంశాల చుట్టూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

Show comments