Dharani
Dharani
మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ.. తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎక్కువ శాతం సిట్టింగులకే మరో సారి టికెట్లు కేటాయించారు గులాబీ బాస్. అయితే కొందరు ఆశావాహులకు మాత్రం టికెట్ దక్కలేదు. వారిలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఉన్నారు. ఆయనకు కూడా టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన కార్యకర్తలను చూసి రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. రాజయ్యను ఆ పరిస్థితిలో చూసిన అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక రాజయ్య ఇలా ఏడవడం చూసి.. బాధపడ్డవారిలో సర్పంచ్ నవ్య కూడా ఉండటం గమనార్హం.
నవ్య బాధపడటం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు రాజయ్యకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కారణమే సర్పంచ్ నవ్య అని కొందరు భావిస్తున్నారు. కొన్ని నెలల క్రితం సర్పంచ్ నవ్య.. రాజయ్యపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నవ్య ధాటికి.. చివరకు రాజయ్య ఆమె ఇంటికి వచ్చి స్వయంగా క్షమాపణ చెప్పారు. అప్పట్లో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం కారణంగానే రాజయ్యకు టికెట్ రాలేదని సమాచారం. ఈ క్రమంలో ఓ రిపోర్టర్.. టికెట్ రాకపోవడంతో రాజయ్య ఏడవడం గురించి నవ్య స్పందన ఏంటని ప్రశ్నించాడు.
ఇందుకు నవ్య ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. రాజయ్యకు టికెట్ రాకపోవటం నిజంగా బాధాకరమైన విషయం అన్నారు. ఎవరికైనా.. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఉంటుందని.. రాజయ్య కూడా అలానే భావించారని అన్నారు. అందుకే రాజయ్య ఈసారి కూడా టికెట్ వస్తుందని ఆశించగా.. రాకపోవటంతో చాలా బాధపడ్డారని.. ఆయన పరిస్థితి చూస్తుంటే తనకు చాలా బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు సర్పంచ్ నవ్య.
అంతేకాక తనలో.. తప్పు చేస్తే నిలదీసే కఠిన గుణమే కాకుండా.. తల్లి గుణం కూడా ఉందని.. రాజయ్య అలా బాధపడటం చూసి.. తనకు అయ్యో పాపం అనిపించిందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క మహిళకు కఠిన గుణంతో పాటు అమ్మతనం కూడా ఉంటుందని.. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని.. అలాంటి వారిపై కోపం ఉండటం సహజమే కానీ.. తప్పు చేసిన వారు.. ఇలా బాధపడుతుంటే సంతోషించేంత కఠినమైన మనసు తనది కాదని చెప్పుకొచ్చారు సర్పంచ్ నవ్య. ఆమె తీరుపై జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.