Idream media
Idream media
రాజకీయాల్లోకి అనేక మంది వస్తుంటారు.. పోతుంటారు. అయితే కొంతమంది మాత్రమే ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుంటారు. డబ్బు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలకోసం పనిచేసిన వారే వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. నీతివంతమైన, హుందా రాజకీయాలు కరువైన ప్రస్తుత తరుణంలో వేగు చుక్క మాదిరిగా వెలుగులోకి వచ్చి.. అమావాస్య చీకటిరోజున మాయమైనట్లుగా వెళ్లిపోయిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హుందా రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు.
చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు గౌతమ్ రెడ్డి వెళ్లిపోయినా.. ఆయన ప్రజల జీవితాల్లో నిలిచి ఉండేలా గౌతమ్ రెడ్డి తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి ఇవ్వాలని, అవి ప్రజలకు ఉపయోగపడాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి సంకల్పించారు. అనుకున్నదే తడవుగా నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి పేరిట ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మెరిట్స్) ఆస్తులను ప్రభుత్వానికి ఇస్తామని ప్రకటించారు. గౌతమ్ రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ, 225 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని ప్రజల కోసం వెచ్చించేలా ప్రభుత్వానికి ఇస్తామని మేకపాటి.. సీఎం జగన్‌కు తెలిపారు.
మేకపాటి నిర్ణయంపై హర్షం వ్యక్తంచేసిన సీఎం జగన్.. ఈ విషయంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో విధానపరమైన నిర్ణయం తీసుకోవడం ఇక లాంఛనమే. ఆ తర్వాత ఆ ఆస్తులను ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం ఉపయోగించనుంది.
విద్యాధికుడైన మేకపాటి గౌతమ్ రెడ్డి (50) ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో చదివారు. తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీ చేయగా.. గౌతమ్ రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. ఇద్దరూ విజయం సాధించారు. ఏపీ రాజకీయాల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి సీనియర్ నేత. పలు నియోజకవర్గాల నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు.
2014లో పోటీచేసిన తొలిసారే ఎమ్మెల్యేగా ఎన్నికైన గౌతమ్ రెడ్డి వైసీపీ అధికారంలోకి రాకపోయినా.. నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్రవేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ముందున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించారనే పేరొందారు. ఈ క్రమంలోనే రెండోసారి 2019 ఎన్నికల్లో సునాయాస విజయం సాధించారు. 80 పదుల వయస్సుతోపాటు అనారోగ్య కారణాలతో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
రెండోసారి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. జగన్ మంత్రివర్గంలో గౌతమ్‌కు సముచిత స్థానం దక్కింది. వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు, మీడియా, ప్రచారానికి దూరంగా ఉంటూ అందరూ మెచ్చేలా గౌతమ్ రెడ్డి పనిచేశారు. ప్రజా జీవితంలో ఉన్నది స్వల్పకాలమైనా.. గౌతమ్ రెడ్డి తనదైన ముద్రవేశారు. అకాలమరణం పొందినా.. ప్రజల జీవితాల్లో ఉండేలా ఆయన పేరిటి ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గౌతమ్ రెడ్డికి భార్య శ్రీ కీర్తి, కుమార్తె అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్ రెడ్డి ఉన్నారు.