ఆరోజు జగన్‌ నా చేయి పట్టుకుని ఓ మాట చెప్పాడు.. ఇప్పుడు అదే చేస్తున్నాడు: ప్రియదర్శిని రామ్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందాడంటే.. నేటికి కూడా చాలా మంది నమ్మరు. ఆ వాస్తవాన్ని వారు జీర్ణించుకోలేరు. ప్రజా సంక్షేమ పాలన అంటే ఎలా ఉంటుందో.. చేతల్లో చేసి చూపించాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. నాయకుడు అంటే తాను మాత్రమే అందలం ఎక్కి.. వైభోగాలు అనుభవించడం కాదు.. తనను నమ్మిన జనాలకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకునేవాడు అని తన చేతల ద్వారా చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. తీసుకువచ్చిన పథకాల వల్ల లబ్ధి పొందని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వల్ల కలిగిన మేలును ఎవరు అంత త్వరగా మర్చిపోరు. అందుకే తమ గుండెల్లో ఆయన ఎప్పటికి సజీవంగానే ఉంటారని చెబుతారు జనాలు. ప్రజల మనసులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే ఏంటో.. తన పాట ద్వారా తెలియజేశాడు నటుడు, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ రైటర్‌ ప్రియదర్శిని రామ్‌. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చిన సాక్షి పేపర్‌, టీవీల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా ఐడ్రీమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్సార్‌, జగన్‌తో తనకు గల అనుబంధం గురించి చెప్పుకొచ్చారు ప్రియదర్శిని రామ్‌.

ఈ సందర్భంగా ప్రియదర్శిని రామ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆ రోజును నేను ఇంకా మర్చిపోలేదు. ఆయన నవ్వుతూనే హెలికాప్టర్‌ ఎక్కారు. వాతావరణం బాగా లేదు ఆగిపోండి అంటే.. వెదర్‌ బాగాలేకపోతే తిరిగి వెనక్కి వస్తాం. నాది ఒక్కడిదే ప్రాణం కాదు కదా.. నడిపేవాడు, సెక్యూరిటీ.. ఇలా అందరి ప్రాణాలు ముఖ్యమే. వారికి ఏమైనా జరిగితే.. వాళ్ల కుటుంబాలు ఇబ్బంది పడతాయి కదా అన్నారు. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం గురించి తెలిసింది. ఆయన కచ్చితంగా తిరిగి వస్తాడని భావించాం. ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చాడు.. ఇది దాటలేడా అనుకున్నాం. తిరిగి వస్తాడనే నమ్మకంతోనే ఉన్నాం. కానీ మా దురదృష్టం. ఆయన మృతి చెందారనే వార్త వినాల్సి వచ్చింది’’ అని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

‘‘ఆ తర్వాత నేను అమ్మను(విజయమ్మ) చూద్దాం అని వెళ్లాను. కానీ అప్పటికే ఆమె పరిస్థితి ఏం బాగాలేదు. నేను వెళ్తే ఆ దుఖం మరింత పెరుగుతుంది అనిపించింది. అలానే కిందకు వచ్చాను. మెట్ల పక్కన జగన్‌ చైర్‌లో కూర్చుని ఉన్నారు. ఆయనను తప్పించుకుని వెళ్దామని ప్రయత్నించాను. కానీ జగన్‌ తలెత్తకుండానే.. అన్న అని పిలిచాడు. దగ్గరకు వెళ్లాను. నా చేతులు పట్టుకున్నాడు. అలానే రెండు మూడు నిమిషాలున్నాడు. తను ఎంత బాధ పడుతున్నాడో ఆ నిమిషం నాకు అర్థం అయ్యింది. తర్వాత తనే నెమ్మదిగా తేరుకుని.. చెప్పులు లేకపోతే ఏందన్నా.. నాయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవాలి అన్నారు. ఆ తర్వాత అనిపించింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఎక్కడకు వెళ్లలేదు. ఆయన చేసిన పనిలో ఉన్నారు.. ప్రాజెక్ట్స్‌లో ఉన్నారు. పూచే పూవులో, వీచే గాలిలో ఆయన ఉన్నారు. అందుకే ఏడ బోతవు రాజన్న అనే పాట రాశాను’’ అని చెప్పుకొచ్చారు.

Show comments