iDreamPost
android-app
ios-app

ధైర్యం చెబుతున్న పీకే..!

ధైర్యం చెబుతున్న పీకే..!

గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఓటమి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆయా రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలతోపాటు బీజేపీకి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలలో ఈ ఫలితాలు నిరాశను నింపాయి. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇలా ఫలితాలు వచ్చాయో లేదో.. వెంటనే మోదీ మైక్‌ అందుకున్నారు. అభివృద్ధికి ఓటు వేశారని, తమ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారంటూ మాట్లాడారు. అదే సమయంలో 2024 ఎన్నికల గురించి ప్రస్తావించారు. విజయోత్సవ ర్యాలీలతోనూ 2024 ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయంటూ బీజేపీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతలు మోదీ చెప్పిన విషయాన్నే చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని, ఇప్పటి వరకు అధికారం దక్కని రాష్ట్రాలలోనూ జెండా ఎగురవేస్తామని ప్రకటనలు చేస్తున్నారు.

నాలుగు రాష్ట్రాలలో గెలుపు బీజేపీ నేతల చేత అలా మాట్లాడిస్తోంది. ఫలితాలు, బీజేపీ నేతల ప్రకటనలతో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఢీలా పడడం సర్వసాధారణమే. మమతా బెనర్జీ వంటి వారు.. వెంటనే తేరుకు అందరం కలిసి పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీలలో ఇలాంటి పరిస్థితి ఉండడంతో.. వెంటనే ప్రశాంత్‌ కిషోర్‌ రంగంలోకి దిగారు. ఆయా పార్టీలకు, బీజేపీ వ్యతిరేకులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ‘‘ లోక్‌సభ ఎన్నికలు 2024లో జరుగుతాయి. తాజా అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా అప్పటి ఫలితం అప్పుడు వెలువడుతుంది. సాహెబ్‌(ప్రధాని)కి ఈ విషయం తెలుసు. అయితే అసెంబ్లీ ఫలితాలకు లోక్‌సభ ఎన్నికలకు ముడి పెట్టి, ప్రతిపక్ష పార్టీలపై మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నమిది. ఆ ఉచ్చులో పడొద్దు’’ అంటూ పీకే ప్రతిపక్ష పార్టీలకు సూచించారు.

తన వ్యాఖ్యలను బలపరిచేందుకు పీకే గతాన్ని గుర్తు చేశారు. 2012 ఎన్నికల్లో గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో కాంగ్రెస్‌ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీలు గెలిచినా.. ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం 2014 సార్వత్రిక ఎన్నికల్లో కనిపించలేదని గుర్తు చేసిన పీకే.. బీజేపీ వ్యతిరేక శక్తులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పీకే మాటలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న పార్టీలు, నేతల్లో ఎంత మేరకు భరోసాను కలిగిస్తాయో చూడాలి. మమతా బెనర్జీ ఎప్పటిలాగే హుంకరిస్తుంది. బీజేపీపై ఒంటికాలిపై లేస్తూ.. కేంద్రంలో కొనసాగుతారా..? నడుస్తారా..? లేదా..? చూడాలి.