Idream media
Idream media
ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మేనల్లుడు లోకేష్ మృతి చెందారు. ఈ నెల 2వ తేదీన ఐ. పోలవరం మండలం పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని కారు ఢీకొన్న ఘటనలో ఎమ్మెల్యే కుమారుడు సుమంత్, మేనల్లుడు లోకేష్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అమలాపురంలోని ఎమ్మెల్యే నివాసం నుంచి సుమంత్, లోకేష్ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కాకినాడ బయలుదేరారు. మంగళవారం రాత్రి 10 గంటలకే ఎమ్మెల్యే సతీష్ నిద్రపోగా సుమంత్ తల్లిని బతిమలాడి కారు తీసుకుని బావ లోకేష్‌తో కలిసి బయల్దేరారు.
లోకేష్ కారు నడుపుతున్న క్రమంలో పాత ఇంజరం వద్ద వారి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న లోకేష్‌తో పాటు ముందు సీటులో ఉన్న సుమంత్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హైవే మొబైల్ పోలీసులు క్షతగాత్రులను యానాం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సుమంత్ ఆరోగ్యం ముందు నుంచి కాస్త మెరుగ్గా ఉండగా, లోకేష్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతూ వచ్చాయి. ఆయన ప్రమాదం జరిగిన నాటి నుంచి బ్రెయిన్ డెడ్ లోనే ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం గుండెపోటు రావడంతో లోకేష్ మృతి చెందినట్టు అపోలో వైద్యులు దృవీకరించారు.
ఎమ్మెల్యే కుమారుడు సుమంత్ కోలుకుంటున్నారు. విషయం తెలిసిన సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యేకు ఫోన్‌చేసి పరామర్శించారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఇక పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ను పరామర్శించారు. అయితే తన కుమారుడు ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉండడం మేనల్లుడు మృతి చెందడంతో ఎమ్మెల్యే సతీష్‌కుమార్ కన్నీరుమున్నీరవుతున్నారు. హాస్టల్లో చదువుకుంటున్న సుమంత్, లోకేష్ సరదాగా పండగకు రెండురోజుల కిందట ఇంటికి వచ్చి ప్రమాదానికి గురికావడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. సుమంత్ విజయవాడలో బీబీఎమ్ చదువుతూ ఉండగా లోకేష్ చెన్నైలో ఇంజినీరింగ్ చదువుతున్నారు.