Idream media
Idream media
దేశంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ మళ్లీ జవసత్వాలు నింపుకోవాలని తీవ్రంగా మధనపడుతోంది. ఈ మేరకు మే 13 నుంచి మేధోమదన సదస్సు ప్రారంభించనుంది. దేశం నలుమూలల నుంచి 400 మంది సీనియర్ నేతలు పాల్గొనే ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మే 13 నుంచి 15 వరకు ‘చింతన్ శిబిర్’ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలు, పార్టీ పునరుజ్జీవానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
అయితే.. కాంగ్రెస్ మేథోమధనంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన పార్టీ పునరుజ్జీవం, పీకే చేరిక, తదితర అంశాలపై సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకతో చర్చించారు. ఆ తర్వాత సీనియర్ నేతలు కమల్‌నాథ్, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్, రణదీప్ సూర్జేవాలాతోనూ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పీకే కూడా పాల్గొన్నారు. మంగళవారం కూడా నేతలు సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో సోనియా పాల్గొనలేదు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని, రాష్ట్రాల వారీగా అవలంబించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలకు పీకే వివరించినట్లు తెలిసింది. పీకే సలహాలు, సూచనలపై ఈ నేతలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సోనియాకు కార్యాచరణను సూచిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రశాంత్ కిశోర్‌కు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నేతల నివేదిక మేరకు పీకేకు అప్పగించాల్సిన బాధ్యతలు, హోదా గురించి సోనియా ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.