Idream media
Idream media
ఆందోళనలు, అరెస్టుల హైడ్రామా, ఆరోపణలతో వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, బద్నెరా ఎమ్మెల్యే రవి రాణాను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (మే 6 వరకు)కు పంపుతూ ముంబై బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు ఆదివారం ఆదేశాలిచ్చింది. దీంతో నవనీత్ కౌర్‌ను బైకుల్లా మహిళా కారాగారానికి, రవి రాణాను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు.
సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతో శ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ శనివారం వీరు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ముంబై పర్యటన నేపథ్యంలో తమ ఆలోచనను విరమించుకున్నామంటూ తర్వాత తెలిపారు. అనంతరం శనివారం సాయంత్రం ఎంపీ దంపతులను అరెస్టు చేసిన పోలీసులు.. భిన్న వర్గాల మధ్య శత్రుత్వం ప్రేరేపించేలా వ్యవహరించారంటూ ఐపీసీ సెక్షన్ 153 కింద, నిషేధాజ్ఞల ఉల్లంఘన కింద ముంబై పోలీస్ యాక్ట్ సెక్షన్ 135 ప్రకారం కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణను అడ్డుకున్నారంటూ ఐపీసీ సెక్షన్ 353ని కూడా జోడించారు. దీంతోపాటు రెండో ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 124ఏ కింద రాజద్రోహం కేసు నమోదు చేశారు. అధికార యంత్రాంగాన్ని సవాలు చేస్తూ, సీఎంపై వ్యాఖ్యలు చేసినందున వారిపై ఐపీసీ సెక్షన్ 124-ఎ (రాజద్రోహం) కింద అభియోగాలు మోపినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎంపీ దంపతులను ఆదివారం బాంద్రా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చింది. వీరు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును ఈ నెల 29న విచారించనుంది.
కాగా, తమ ఇంటి ముందు గుమిగూడి అల్లర్లకు ప్రయత్నించారంటూ ఎంపీ దంపతులు చేసిన ఫిర్యాదు మేరకు 13 మంది శివసేన కార్యకర్తలపైనా ఖార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శనివారం రాత్రి ఖార్ స్టేషన్‌లో ఉన్న నవనీత్ కౌర్ దంపతులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య కారుపై దాడి జరిగింది. సోమయ్య రాకను నిరసిస్తూ.. ఠాణా ఎదుట గుమిగూడిన శివసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆయన తిరిగి వెళ్తుండగా కారుపై చెప్పులు, నీళ్ల సీసాలు పడ్డాయి. సోమయ్య బాంద్రా ఠాణాలో ఫిర్యాదు చేయగా గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సెక్షన్ల పట్ల సంతృప్తి చెందడం లేదంటూ కాపీని తీసుకునేందుకు నిరాకరించారు.