Idream media
Idream media
‘నాకు మంత్రి పదవి రాదని కొంతమంది ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు వచ్చింది కాబట్టి, కోర్టులో చోరీ.. కుట్రపూరితంగా పథకం ప్రకారం చేయించారా అనే అనుమానం కలుగుతోంది’ అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులో ఆయన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. గత ప్రభుత్వంలో సోమిరెడ్డి తనపై పెట్టిన కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో ప్రాథమిక ఆధారాల్లేవని కోర్టు మూడుసార్లు రిటర్న్ చేసిందని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసులు మళ్లీ చార్జిషీటు వేశారని.. తాను పట్టించుకునేవాడినైతే అసలు దాఖలు చేసేవారేకాదని చెప్పారు. అటువంటిది ఇప్పుడు తాను చోరీ చేయించానని ప్రతిపక్షాలు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను దొంగతనం చేయించి ఉంటే డాక్యుమెంట్లు, ఆధారాలు కోర్టు ప్రాంగణంలోనే ఎందుకు మిగులుస్తానని ప్రశ్నించారు. ఈ కేసుపై న్యాయస్థానం ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చని, ఆరోపణలు చేస్తున్న వారికి నమ్మకం, ధైర్యం ఉంటే హైకోర్టు ద్వారా సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు.
మంగళగిరిలో తనకు ఇల్లు లేదని, వేరొకరి ఇంట్లో దిగానని.. అక్కడ ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోయారని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే అక్కడున్న వారు అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారమిచ్చారని పేర్కొన్నారు. ఇందులో గోప్యత ఏమీలేదని, తనకు పదవి రావడం ఇష్టంలేని ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.