iDreamPost
android-app
ios-app

ఇది చాలా.. ఇంకా కావాలా.. నవనీత్‌ కౌర్‌ దంపతులకు పోలీసుల వీడియో సాక్ష్యం

ఇది చాలా.. ఇంకా కావాలా.. నవనీత్‌ కౌర్‌ దంపతులకు పోలీసుల వీడియో సాక్ష్యం

ఎంపీ నవనీత్‌ కౌర్‌, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు ఈ నెల 29 వరకూ జైల్లో ఉండాల్సిందే. బెయిల్‌ కోసం వారు దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణకు ముంబై సెషన్‌ కోర్టు 29వ తేదీకి వాయిదా వేసింది. తమపై ముంబై పోలీసులు పెట్టిన దేశద్రోహం, విద్వేషాన్ని ప్రోత్సహించడం కేసులకు సంబంధించి బెయిల్‌ ఇప్పించాలంటూ సోమవారం రాణా దంపతులు సెషన్‌ కోర్టును ఆశ్రయించారు. ఇది మంగళవారం విచారణకు వచ్చింది. అయితే దీనిపై తమ ప్రతిస్పందనను అఫిడవిట్‌ రూపంలో తెలియజేస్తామంటూ ముంబై పోలీసులు తెలపడంతో కోర్టు మన్నించి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

మహారాష్ట్ర సీఎం ఇంటి ఎదుట హనుమాన్‌ చాలీసా పఠనం వివాదానికి సంబంధించి రాణా దంపతులను శనివారం పోలీసులు అరెస్టు చేయడం, నవనీత్‌ రాణాను బైకుల్లా మహిళా కారాగారానికి, రవి రాణాను నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించడం తెలిసిందే. అంతకుముందు ఈ దంపతులు బాంద్రా మెజిస్ట్రేట్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా ఆ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం ఆ బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు రాణా దంపతుల తరపు న్యాయవాది రిజ్వాన్‌ మార్చంట్‌ సోమవారం పేర్కొన్నారు.

మరోవైపు.. శనివారం అరెస్టయిన రోజు తమ పట్ల ఖర్‌ స్టేషన్‌లో పోలీసులు అనుచితంగా వ్యవహరించారంటూ లోక్‌సభ స్పీకర్‌కు నవనీత్‌ రాణా లేఖలో ఫిర్యాదు చేశారు. కనీసం తమకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, తమను కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై ముంబై సీపీ సంజయ్‌ పాండే స్పందించారు. ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆరోజు పోలీసు అధికారుల ఎదుట కుర్చీలో రాణా దంపతులు కూర్చుని చాయ్‌ తాగుతున్న 12 సెకన్ల తాలూకు వీడియోను ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. వారి ఎదుట ఉన్న టేబుల్‌పైన మినరల్‌ వాటల్‌ బాటిళ్లు కూడా ఉన్నాయి. ‘ఇది సరిపోతుందా.. ఇంకా ఏమైనా వివరాలు కావాలా?’ అంటూ ఆ వీడియో కింద రాశారు.