iDreamPost
android-app
ios-app

మిజోరాం సీఎంను చంపేస్తానని బెదిరింపు..!

మిజోరాం సీఎంను చంపేస్తానని బెదిరింపు..!

మీ పదవికి రాజీనామా చేయండి.. మూడు నెలల్లోగా ఆ పని చేయకపోతే మిమ్మల్ని చంపేస్తా.. అని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రినే బెదిరించాడు ఓ ఆగంతకుడు. మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగ్ ను బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ పోస్ట్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. దుండగుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీఎంను చంపడానికి కారణాలను కూడా నిందితుడు తన పోస్టింగులో వివరిస్తూ పలు ఆరోపణలు చేశాడు. నిందితుడి వద్ద ఎటువంటి ఆయుధాలు లభించలేదని ఐజ్వాల్ ఐజీ జాన్ నెహ్లియా వెల్లడించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఫేక్ అకౌంటుతో బెదిరింపు పోస్టింగ్

సీఎంను బెదిరిస్తూ పోస్టింగు షేర్ చేసిన వ్యక్తి రోడిన్ లియానా అలియాస్ అపుయా టో చ్చంగ్ గా కేసు దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఖాజ్వాల్ ప్రాంతానికి చెందిన ఆయన ప్రస్తుతం రాజధాని ఐజ్వాల్ నగరంలోని చాన్మరీలో నివాసం ఉంటున్నాడు. అయితే అసలు పేరుతో కాకుండా తింగ్ స్లాంగ్ పా అనే మారుపేరుతో ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బెదిరింపు పోస్టును పలు గ్రూపులకు షేర్ చేశాడని పోలీసులు నిర్ధారించారు. వెంటనే అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీఎంను బెదిరించడం నిందితుడికి ఇదే తొలిసారి కాదని ఐజీ జాన్ చెప్పారు. 2018లో కూడా అప్పటి ముఖ్యమంత్రి లాల్ తన్హావాలాను కూడా చంపేస్తానంటూ బెదిరింపు లేఖ రాసి జైలుపాలయ్యాడని వివరించారు.

బడ్జెట్ నిధులు కాజేస్తున్నారని ఆరోపణ

తన బెదిరింపు లేఖలో నిందితుడు సీఎం జోరాంతంగ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ముఖ్యమంత్రి అబద్ధాలకోరు అని విమర్శించాడు. రాష్ట్ర బడ్జెట్ నిధులను సొంత ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించాడు. అందుకే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. దానికి మూడు నెలల గడువు ఇచ్చాడు. ఆలోగా రాజీనామా చేయకపోతే హత్య చేయిస్తానని హెచ్చరించాడు. అందుకోసం ఒక షార్ప్ షూటర్ను ఇప్పటికే ఏర్పాటు చేశానని కూడా పేర్కొన్నాడు. అయితే అరెస్టు అయిన అతని వద్ద ఎటువంటి ఆధారాలు, ఆయుధాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి