Dharani
Dharani
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తనకు ప్రాణ హానీ ఉందంటూ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేత నుంచి తనకు ప్రాణహానీ ఉందంటూ ఈటెల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రతిపక్ష నేత.. అధికార పార్టీ నేత మీద ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై స్పందించారు.ఈటెల భద్రతపై ఆరా తీశారు. ఆయనకు భద్రత కల్పించాలని డీజీపీకి సూచించారు. ఆ వివరాలు..
తనకు ప్రాణ హానీ ఉందంటూ ఈటెల సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. మంత్రి కేటీఆర్ ఆయన భద్రతపై డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్ చేసి చర్చించారు. బుధవారం ఉదయం డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్.. ఈటల భద్రతపై చర్చించారు. ఆయన భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో చెక్ చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఈటెలకు సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో.. ఈటెల భద్రత పెంపుకు సంబంధించి.. డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష చేశారు. ఐపీఎస్ అధికారి ఒకరు ఈటెల ఇంటికి వెళ్లి ఆయన భద్రత గురించి ఆరా తీశారు.
ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఇలా ఉండగానే ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. రాజేందర్‌ను చంపేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, ఇందుకోసం రూ. 20 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత ఒకరు ఈ కామెంట్స్ చేసినట్లు తమకు సమాచారం అందిందన్నారు. తమ కుటుంబంలో ఎవరికైనా ఏమైనా హాని జరిగితే, దానికి బాధ్యులు ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారంటూ జమున సంచలన ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.