Idream media
Idream media
బీజేపీయేతర రాజకీయాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్.. తన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలుకోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించి మరో అడుగు ముందుకేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి వెళ్లనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చి ఆ తరువాత రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వాహనాన్ని ఎక్కించడం, ఈ ఘటనలో రైతులు, జర్నలిస్టు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
లఖింపూర్ ఖేరీ ఘటన దేశంలో పెను ప్రకంపనలు సృష్టించింది. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర నిరసనలు పెల్లుబికాయి.చివరికి యూపీ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని,బీజేపీ విజయావకాశాలు దెబ్బతింటాయన్న ప్రచారం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంతోపాటు లఖింపూర్ ఖేరీలోనూ కమలం పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కేసీఆర్ అక్కడికి వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోసారి సుదీర్ఘ ఢిల్లీ టూర్‌కు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో పలువురు ఆర్థికవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశముంది. దేశ రైతాంగం కోసం ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చరల్ పాలసీ రావాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల ప్రగతిభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డ ముఖ్యమంత్రి దీనిని సాధించేందుకు తన సర్వశక్తులను ధారపోసి ప్రయత్నం చేస్తానన్నారు. ఆ ప్రయత్నాల్లో వేగం పెంచనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఢిల్లీలో ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి వర్క్‌షాప్ పెట్టి, ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీని డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఢిల్లీలో వారితో భేటీ అవుతారని తెలుస్తోంది. వారితో మంతనాలు జరిపి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక పోరాటంపై ఓ ప్రణాళికను రచించుకుంటారని సమాచారం.