Idream media
Idream media
కొన్ని నెలలుగా కర్ణాటకలో వివాదంగా మారిన హిజాబ్ అంశంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని తెలిపింది. ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్ ధరించడం తప్పనిసరేం కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటకలోని పలు జిల్లాలు, ముఖ్య నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పలు ఆంక్షలు విధించారు. కలబురగి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. సోమవారం రాత్రి నుంచి మార్చి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది. విద్యా సంస్థలను కూడా మూసివేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. శివమొగ్గలోని స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 21 వ తేదీ వరకు వారంరోజుల పాటు బెంగుళూరులోని బహిరంగ ప్రదేశాల్లో గూమిగూడటం, నిరసనలు, వేడుకలు చేయడంపై నిషేధం విధిస్తూ బెంగుళూరు కమిషనర్ కమల్ పంత్ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగుళూరులోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ అవస్థి నివాసం వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.
గత ఏడాది డిసెంబర్ నెలాఖరులో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించిన కొందరు విద్యార్థినిలను ఉడుపిలోని ఓ ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీనిపై నిరసన వ్యక్తమైంది. దీంతో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో హిబాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విద్యా సంస్థలను మూసివేశారు.
ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేశారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 14 నుంచి పాఠశాలలు, 16 నుంచి కళాశాలలను తెరిచారు. ఈ లోపు హిజాబ్ వివాదంపై దాఖలైన అన్ని పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెల్లడించే వరకు ఎవరూ మతపరమైన వస్త్రాలు ధరించి కళాశాలలకు రావద్దని స్పష్టం చేసింది. తాజాగా తుది తీర్పును వెలువరించింది.