iDreamPost
android-app
ios-app

టీడీపీలో వర్గపోరు.. మాజీ ఎమ్మెల్యే కన్నీళ్లు..

  • Published Mar 08, 2022 | 4:05 PM Updated Updated Mar 08, 2022 | 7:49 PM
టీడీపీలో వర్గపోరు.. మాజీ ఎమ్మెల్యే కన్నీళ్లు..

కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సభాముఖంగా పెట్టిన కన్నీళ్ళు ఆ పార్టీలో పెరిగిన వర్గపోరుకు దర్పణం పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మొన్న ఆదివారం జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో తనకు, తన భర్త, టీడీపీ సీనియర్ నాయకుడు పిల్లి సత్తిబాబుకు పార్టీలో జరుగుతున్న అవమానాలను ఏకరువు పెడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

అనంతలక్ష్మిని నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి, పిల్లి సత్తిబాబును పార్లమెంట్ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించారు. పిల్లి అనంతలక్ష్మి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఒకసారి జెడ్పీటీసీగా సత్యనారాయణమూర్తి ఇక్కడ గెలిచారు. అలాంటి తమను పార్టీ పదవుల నుంచి తప్పించడానికి ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకులు చేసిన దుష్ప్రచారమే కారణం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేపనిగా తమపై తప్పుడు ఫిర్యాదులు చేయడం ద్వారా పార్టీ అధిష్టానాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని వారు అంటున్నారు.

మూడుముక్కలాటలో పిల్లి దంపతుల ఓటమి..

వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటును ఆశిస్తున్న పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కన్వీనర్‌ పెంకే శ్రీనివాసబాబా వర్గాల మధ్య గ్రూపు రాజకీయం నడుస్తోంది. తాజాగా జెడ్పీ మాజీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ కూడా కాకినాడ రూరల్ సీటును ఆశిస్తుండడంతో వర్గపోరులో జోరు పెరిగింది. అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు పార్టీని గాలికి వదిలేయడంతోనే వరుసగా అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని చిన రాజప్ప, శ్రీనివాసబాబా వర్గాలు పెద్దఎత్తున ప్రత్యేక బస్సులలో వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేశాయి. దాంతో పార్టీ పదవుల నుంచి వారిని అధిష్టానం తప్పించింది. దీనికితోడు కొత్తగా రంగంలోకి దిగిన జ్యోతుల నవీన్‌ వర్గం కూడా తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అనంతలక్ష్మి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫండ్‌ను సొంత ఆస్తుల కొనుగోలుకు వినియోగించినట్టు ప్రచారం చేయడంపై కన్నీరు పెట్టుకున్నారు. ఈ విధంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ సీటును ఆశిస్తున్న మూడు గ్రూపుల మధ్య జరిగిన రాజకీయ ఆటలో పిల్లి దంపతులు ఓడిపోయారు.

బలం పెంచుకునే పనిలో వర్గాలు..

నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించే కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. కాపు సామాజికవర్గానికి చెందిన
చినరాజప్ప, జ్యోతుల నవీన్ ఒకపక్క, శెట్టిబలిజ వర్గానికి చెందిన పెంకే శ్రీనివాసబాబా తమ వర్గాలను తయారు చేసుకొనే పనిలో ఉన్నారు. దీంతో నియోజకవర్గంలోని అటు కాపు, అటు శెట్టిబలిజల్లోని కీలక నాయకులను తమ వైపు తిప్పుకొనేందుకు ఈ మూడు వర్గాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

దాదాపు మూడు దశాబ్దాలుగా పార్టీలో ఉండి పలు పదవులు నిర్వహించిన అనంతలక్ష్మి దంపతులు తమను ఎన్ని అవమానాలకు గురిచేసినా ఇన్నాళ్లూ సహించారు. అయితే ప్రత్యర్థి వర్గాలు వ్యక్తిత్వ హననానికి దిగడంతో వారు పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. అందుకే నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు కూడా. జనసేన, బీజేపీలు అనంతలక్ష్మి దంపతులను తమ పార్టీల్లో చేరాలని కోరుతున్నాయి. తమకు గౌరవం ఇచ్చే ఏదో ఒక పార్టీలోకి సామూహికంగా వెళదామని అనుచరులు కోరుతున్నారు. అయితే తాము తుదిశ్వాస వరకు టీడీపీలోనే ఉంటామని, తమ పార్థివదేహాలపై కూడా పార్టీ జెండానే కప్పాలని అనంతలక్ష్మి దంపతులు ఉద్వేగంగా చెబుతున్నారు. పార్టీతో ఇంత అనుబంధం ఉన్న వీరు టీడీపీని వీడరని, అవమానాలను తట్టుకోలేక రాజకీయాలకే గుడ్ బై చెబుతారని పలువురు భావిస్తున్నారు.