Idream media
Idream media
భారత్ విదేశీ విధానాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. రష్యా నుంచి ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న ఆ దేశ విధానాన్ని ప్రస్తావిస్తూ… దేశ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే భారత్ ఆ నిర్ణయం తీసుకుందని మాజీ ప్రధాని కొనియాడారు. లాహోర్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటూనే రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. భారత్ నిర్ణయాలు ఆ దేశ ప్రజల మేలుకోరి తీసుకుంటున్నవే. మన విదేశాంగ విధానం మాత్రం కొందరి శ్రేయస్సు కోసమే’’ అని సొంతదేశంపైనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ విదేశీ విధానం స్వతంత్రమైంది కాబట్టే పొరుగుదేశాన్ని తాను మెచ్చుకుంటున్నానని ఇమ్రాన్ స్పష్టంచేశారు. అమెరికాతో మైత్రి కొనసాగిస్తున్న భారత్ క్వాడ్‌లోనూ (ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా కూటమి) భాగస్వామిగా ఉందని ఆయన గుర్తుచేశారు.
ఇదే సందర్భంగా రష్యా పర్యటనను ఆయన సమర్థించుకున్నారు. పాక్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవాలని భావించే రష్యాకు వెళ్లానని పేర్కొన్నారు. 30 శాతం రాయితీపై ఆయిల్ ఇచ్చినందువల్లే తాను రష్యాలో పర్యటించానని ఇమ్రాన్ స్పష్టంచేశారు. కరోనా సంక్షోభంలోనూ పాక్ ఆర్థిక పరిస్థితి పుంజుకుని.. ఎగుమతులు రికార్డుస్థాయిలో పెరిగిన వేళ..తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు (అమెరికా) స్థానిక నేతలతో చేతులు కలిపాయని ఇమ్రాన్ మరోసారి ఆరోపించారు.
చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావించడం ఇష్టంలేకనే విదేశీ శక్తులు తనపై కుట్రపన్నాయని విమర్శించారు. స్థానిక నేతల మద్దతులేకుండా ఈ కుట్ర విజయవంతం అయ్యేదికాదని ఆయన ఆరోపించారు. కాగా, అమెరికా కుట్ర కారణంగానే తన ప్రభుత్వం కూలిపోయిందన్న ఇమ్రాన్ ఆరోపణలను పాకిస్తాన్ జాతీయ భద్రత కమిటీ (ఎన్‌ఎస్‌సీ) ఖండించింది.