iDreamPost
android-app
ios-app

వినూత్న విధానాలే ఆప్ విజయ సోపానాలు

  • Published Mar 10, 2022 | 6:49 PM Updated Updated Mar 11, 2022 | 6:22 AM
వినూత్న విధానాలే ఆప్ విజయ సోపానాలు

పేరు.. సామాన్యుడి పార్టీ. ఎన్నికల గుర్తు చీపురు. నాయకుడేమో ఎటువంటి రాజకీయ నేపథ్యంలేని మాజీ బ్యూరోక్రాట్. అదేం పార్టీ.. మూన్నాళ్లకే మాయంకావడం ఖాయమని పలువురు పలు రకాలుగా చర్చించుకున్నారు. తేలిగ్గా తీసిపారేశారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా, సంప్రదాయ రాజకీయాలకు చాలాదూరంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనతికాలంలోనే తన ఉనికిని ఘనంగా చాటుకుంది. జాతీయ పార్టీలనే సవాల్ చేసి పదేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీని ఏలుతోంది. సామాన్యులు, సంస్కరణలే లక్ష్యంగా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోతోంది. తొలిసారి ఢిల్లీ బయట మరో పెద్ద రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకుంది. తాజా పంజాబ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. మొత్తం 117 స్థానాల్లో 92 కైవసం చేసుకోవడమే కాకుండా సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎంలను సైతం మట్టికరిపించి ఔరా అనిపించింది.

అవినీతి వ్యతిరేక ఉద్యమానికి పార్టీ రూపం

సుమారు పదేళ్లక్రితం అవినీతికి పాల్పడేవారికి కఠినశిక్షలు విధించే చట్టాలు చేయాలన్న డిమాండ్ తో సంఘ సేవకుడు అన్నా హజారే చేపట్టిన ఉద్యమంతో ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ చేయి కలిపారు. జనలోక్పాల్ బిల్లుకోసం హజారే చేపట్టిన నిరసనదీక్షకు అండగా నిలిచారు. ఆ ఉద్యమంలో ఉన్న సమయంలోనే.. అదే లక్ష్యాలతో రాజకీయ పార్టీ పెట్టాలని కేజ్రీవాల్ భావించారు. కానీ అన్నా హజారే అంగీకరించలేదు. కానీ హజారే అభిప్రాయానికి విరుద్దంగా కేజ్రీవాల్ ఉద్యమానికి పార్టీ రూపం ఇచ్చారు. 2012 నవంబర్ 26న ఢిల్లీ కేంద్రంగా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు.

తొలి ఎన్నికలతోనే అధికారంలోకి

పార్టీ పెట్టిన ఏడాదిలోపే 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గోదాలోకి దిగి తొలి ప్రయత్నంలోనే జాతీయ పార్టీలకు ఆప్ చుక్కలు చూపించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 31 స్థానాల్లో గెలవగా 28 చోట్ల గెలిచి ఆప్ రెండో స్థానంలో నిలిచింది. 8 సీట్లతో మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెసుతో కలిసి కేజ్రీవాల్ సీఎంగా తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే జనలోక్పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనందుకు నిరసనగా కేజ్రీవాల్ ప్రభుత్వం రాజీనామా చేసింది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 67 సీట్లు గెలిచి కేజ్రీవాల్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆప్ దూకుడు వల్ల బీజేపీ 3 సీట్లకే పరిమితం కాగా కాంగ్రెస్ తొలిసారి ఢిల్లీ అసెంబ్లీలో ఉనికి కోల్పోయింది. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ 62 సీట్లతో ఘన విజయం సాధించి అధికారంలో కొనసాగుతోంది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆప్ విస్తరణకు కేజ్రీవాల్ బాటలు వేశారు. చండీఘడ్ ఎన్నికల్లో సత్తాచాటిన ఆప్.. 2017 పంజాబ్ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగి 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అలాగే గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోను క్రమంగా విస్తరిస్తోంది.

ఆకట్టుకుంటున్న విధానాలు

ఆప్ అనుసరిస్తున్న విధానాలు, ఢిల్లీలో గత తొమ్మిదేళ్లుగా అమలుచేస్తున్న పథకాలు, సంస్కరణలు ఆ పార్టీ ఎదుగుదలకు దోహదం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అనేక సంస్కరణలతో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సామాన్యులకు చేరువ చేసింది. సరసమైన ధరకే నిరంతర విద్యుత్ అందిస్తోంది. తాగునీటికి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకుంది. ఇవన్నీ ఢిల్లీవాసులతో పాటు ఇతర రాష్ట్రాల వారినీ ఆకట్టుకుంటున్నాయి. వీటినే ఢిల్లీ మోడల్ అభివృద్ధిగా కేజ్రీవాల్ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో ప్రచారం చేసి విజయం సాధించింది. దాంతోపాటు ఢిల్లీలో ఉన్న పంజాబీల ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయించింది. దాంతోపాటు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సామాన్యులను, నిరంతరం ప్రజల్లో ఉంటూ మంచి పేరుపొందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం ఆప్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రజాభిప్రాయంతోనే నిర్ణయించడం సానుకూల స్పందన తీసుకొచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా పబ్లిక్ పోల్ నిర్వహించి పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు భగవంత్ సింగ్ మాన్ ను సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించారు. వీటికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు, ఆ పార్టీలో అంతర్గత కలహాలు ప్రజలు ఆప్ కు పట్టం కట్టేలా చేశాయి.