Idream media
Idream media
ప్రధాని మోడీపై అనుచిత ట్వీట్ చేశారన్న ఆరోపణలపై గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మెవానీని అసోం పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో బుధవారం ఆయన్ను అరెస్టు చేసి.. గురువారం ఉదయం విమానంలో గువాహటీకి తరలించారు. అక్కడి నుంచి కోక్రాఝర్ పోలీసు స్టేషన్‌కు రోడ్డుమార్గంలో తీసుకెళ్లారు.
‘ప్రధాని నరేంద్ర మోడీ గాడ్సేను దేవుడిగా భావిస్తున్నారు’ అని మెవానీ ట్వీట్ చేశారు. మోడీ ఇటీవల గుజరాత్‌లో పర్యటించినప్పుడు కూడా మతసామరస్యం కోసం విజ్ఞప్తి చేస్తూ ఇదే ట్వీట్‌ను పోస్టుచేశారు. దీనిపై అసోంలోని బోడోలాండ్ ప్రాదేశిక మండలికి చెందిన బీజేపీ కార్యవర్గ సభ్యుడు అరూప్ డే మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ కూడా ఈ పోస్టును నిలిపివేసిందని తెలిపారు. పోలీసులు వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి తక్షణమే గుజరాత్‌కు చేరుకుని అరెస్టు చేసి తీసుకొచ్చారు.
గుజరాత్ ప్రముఖ దళితనేత అయిన మెవానీ ఇటీవల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఆయన అరెస్టుపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ గురువారం ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ఆయన నిర్బంధం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం, ఆయన్ను ఎన్నుకున్న ప్రజలకు అవమానమని పేర్కొన్నారు. ‘మోడీజీ! అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అసమ్మతిని అణచివేసేందుకు మీరు ప్రయత్నించొచ్చు. కానీ సత్యాన్ని నిర్బంధించలేరు. నియంత (మోడీ) భయపడుతున్నారు. స్వయంప్రకటిత చక్రవర్తి దురభిమానంతో వ్యవహరిస్తున్నారు. కంగారుతో కిందమీదులవుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.