iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌కు హార్ధిక్‌ షాక్‌ల మీద షాక్‌లు

కాంగ్రెస్‌కు హార్ధిక్‌ షాక్‌ల మీద షాక్‌లు

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, పాటీదార్‌ నేత హార్ధిక్‌ పటేల్‌ ఆ పార్టీ నాయకత్వానికి షాకులిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం తనను పని చేయనివ్వడం లేదని ఆక్షేపించారు. బీజేపీని ప్రశంసిస్తూ ఏకంగా రామభజనకు దిగారు. తాము రామభక్తులమని.. శ్రీరామచంద్రుడిపై అచంచల విశ్వాసం ఉందని శుక్రవారం మీడియాకు చెప్పారు. ‘ఇప్పటికీ నన్ను నేను హిందూవాదిగానే భావిస్తున్నాను. నేను రఘువంశీకుడిని. లవకుశులను గాఢంగా ప్రేమిస్తాం. రాముడితో పాటు శివభక్తులం కూడా. మా ప్రాచీన దేవుళ్లను ఆరాధిస్తాం. మేం హిందువులం. హిందూత్వ పరిరక్షణకు హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా కృషిచేస్తున్నాం. నా తండ్రి వర్ధంతి రోజున 4 వేల భగవద్గీత ప్రతులను పంచబోతున్నాం. హిందూత్వతో బంధం ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇందుకు గర్విస్తున్నాను’ అని తెలిపారు.

ఆయన తీరు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలను కలవరపరుస్తోంది. నిజానికి హార్ధిక్ పటేల్‌ రాష్ట్రంలో పటేళ్లకు రిజర్వేషన్‌ కోరుతూ 2015లో పాటీదార్‌ ఉద్యమాన్ని పెద్దఎత్తున నడిపారు. యువతలో గొప్ప క్రేజు సంపాదించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయన ప్రజాదరణ తగ్గుతూ వస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొద్దో గొప్పో పాటీదార్లు మద్దతిచ్చినా.. 2019లో మాత్రం బీజేపీనే సమర్థించారు. తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ దానికే పట్టం కట్టారు. దాంతో కాంగ్రెస్‌ నాయకత్వం హార్ధిక్ ను పట్టించుకోవడం మానేసింది. కొందరు నేతలు ఆయన్ను ఏకంగా పార్టీ నుంచే సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సూచన మేరకు..మరో పాటీదార్‌ నేత, పారిశ్రామికవేత్త నరేశ్‌ పటేల్‌ను పార్టీలోకి తీసుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇదే హార్ధిక్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. అందుకే నాయకత్వంపై ఆయన విరుచుకుపడుతున్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నాయకత్వమే సమస్య. ప్రతిపక్షంగా ప్రజల గొంతుకలను వినిపించలేకపోతున్నాం. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి పోరాడలేకపోతున్నాం. ఆ పరిస్థితుల్లో జనం వేరే ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. బీజేపీకి మంచి, దృఢమైన మూలాలు ఉన్నాయి. ఆ పార్టీ నేతలకు దృఢమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంది. అయితే బీజేపీలో చేరే ఉద్దేశం నాకు లేదు. శత్రువుల సామర్థ్యాన్ని అంగీకరించి.. వారితో పోరాటానికి సరైన దిశగా కృషిచేయాలన్నది నా ఉద్దేశం’ అని హార్ధిక్ వ్యాఖ్యానించారు.