Dharani
గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేరు ఏపీ రాజకీయ సర్కిళ్లలో జోరుగా వినిపిస్తోంది. గంటకో మాట.. పూటకో పార్టీ అన్నట్లుగా ఉన్న అంబటి తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు జనాలు.
గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేరు ఏపీ రాజకీయ సర్కిళ్లలో జోరుగా వినిపిస్తోంది. గంటకో మాట.. పూటకో పార్టీ అన్నట్లుగా ఉన్న అంబటి తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు జనాలు.
Dharani
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పాలిటిక్స్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకున్న అంబటి.. ఆ మేరకు కార్యచరణ సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన సొంత జిల్లా గుంటూరు వ్యాప్తంగా పర్యటించాడు. అక్కడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. ఇక మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా, జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాడు అంబటి. దాంతో ఆయన వైసీపీలో చేరతారని అందరూ చెప్పుకున్నారు. దానికి తగ్గట్టుగానే జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరాడు అంబటి. గుంటూరు నుంచి పోటీ చేస్తానని ఆయనకు ఆయనే ప్రకటించుకున్నాడు.
మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. వైసీపీలో చేరిన వారం రోజులకే.. పార్టీకి రాజీనామా చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించాడు అంబటి. అందులో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని.. అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్లు ట్వీట్ చేయడంతో అందరూ అది నిజమే అయి ఉంటుందని భావించారు. ఈలోపే మరో ఆసక్తికర సన్నివేశం వెలుగులోకి వచ్చింది.
వైసీపీకి గుడ్‌బై చెప్పిన అంబటి.. జనసేన అధినేత పవన్ కళ్యాణతో భేటీ అయ్యాడు. అంతేకాక నా ఆలోచనా ధోరణి.. వైసీపీ భావజాలం విభిన్నంగా ఉంది. అందుకే బయటకు వచ్చాను. రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనే అనుకున్నాను. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పవన్ అన్నను కలవాలని నా మంచి కోరేవారు, మిత్రులు, కుటుంబ సభ్యులు సూచించారు. అందుకే కలిశాను అంటూ తన మనసులోని మాట చెప్పకనే చెప్పాడు.
దాంతో రేపో మాపో అంబటి జనసేనలో చేరతారంటూ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అంబటి తీరుపై జనాలు అసహనం వ్యక్తం చెస్తున్నారు. కెరీర్‌లో కూడా ఇలానే దూకుడుగా నిర్ణయాలు తీసుకుని.. ఇబ్బందులు పడ్డాడని.. ఆచుతూచి నిర్ణయాలు తీసుకునే అలవాటు అంబటికి లేదు.. ఇక మీదట రాదని అంటున్నారు. అంతేకాక కెరీర్‌లో దూకుడు నైజం కారణంగా ఎన్నో అవకాశాలను పొగొట్టుకున్నాడని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
అంబటి రంజీ ఆడే రోజుల్లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్‌తో గొడవపడ్డాడు. ఇద్దరు భౌతిక దాడులు కూడా చేసుకున్నాని వార్తలు వచ్చాయి. అప్పుడు శివలాల్ యాదవ్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండటంతో రాయుడు సమస్యలు ఎదుర్కొన్నాడు. దాంతో 21 ఏళ్లకే బీసీసీఐకి రెబల్‌గా మారడమే కాక.. బోర్డుకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో చేరి నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బీసీసీఐ క్షమాభిక్ష పెట్టడంతో.. మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చాడు రాయుడు. అనంతరం ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు.
దాంతో 2013లో అంబటి రాయుడు భారత జట్టుకు ఆడే అవకాశం వచ్చింది. కానీ అతడి దూకుడు స్వభావం కారణంగా ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అలా 2015లో వరల్డ్ కప్‌కు ఆడే అవకాశం కోల్పోయాడు. ఆ అక్కసుతో 3డీ అంటూ ట్వీట్ చేసి రచ్చ చేశాడు. రాయుడు చర్యలపై ఆగ్రహించిన బీసీసీఐ 2015లో వన్డే ప్రపంచకప్ జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా అవకాశం వచ్చినా పక్కకు పెట్టింది. ఆ కోపంతో నాడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు రాయుడు. తన నిలకడలేని మనస్తత్వం, దూకుడు స్వభావం కారణంగా.. క్రికెట్ కెరీర్ ప్రయాణంలో ఎన్నో వివాదాల్లో నిలిచాడు రాయుడు.
దూకుడు స్వభావం కారణంగా కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన రాయుడు.. సాధారణ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. మరి రాజకీయాల్లో అయినా పరిణీతిగా వ్యవహరించాడా అంటే అది లేదు. వైసీపీలో చేరాడు. రావడం రావడమే గుంటూరు నుంచి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కావాలని ఆశించాడు. జిల్లాలో తనకు ఆదరణ, ప్రజల్లో తనపై విశ్వాసం ఉందా లేదా అన్న విషయాలను పట్టించుకోకుండా.. టికెట్ కోరుకున్నాడు. మరి ఏం జరిగిందో తెలియదు.. వైసీపీలో చేరి పట్టుమని పది రోజులు కూడా గడవకముందే పార్టీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత అయినా కామ్‌గా ఉన్నాడా అంటే.. జనసేన అధినేతతో భేటీ అయ్యి.. మరోసారి తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చను తెర మీదకు తీసుకువచ్చాడు.
అటు కెరీర్.. ఇటు రాజకీయాల్లో రాయుడు దూకుడు స్వభావం చూస్తోన్న జనాలు.. అతడు ఏ పార్టీలో చేరినా.. పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. రాజకీయాల్లో ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు, సహనం. కానీ రాయుడులో ఆలక్షణాలు మచ్చుకైనా లేవని.. అలాంటి వ్యక్తి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే తప్ప లాభం లేదని.. కనుక అతడు ఏ పార్టీలో చేరినా పెద్దగా ఫరక్ పడదు అనుకుంటాన్నారట జనాలు. మరి రాయుడు తీరు మీకెలా అనిపించింది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.