ఉచిత విద్యుత్ YSR మానస పుత్రిక: దిగ్విజయ్ సింగ్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో రైతే రాజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ వైఎస్సార్ ను గుర్చు చేసుకున్నారు. ఆయన పాలన, ఆయన నిర్ణయాలు, ఆయన వ్యక్తిత్వం గురించి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ముక్కుసూటి మనిషి అంటూ చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక అంటూ వ్యాఖ్యానించారు.

దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ..”వైఎస్సార్ తో నా అనుబంధం విడదీయరానిది. పార్టీ నిర్మాణంలో ఆయన యుక్త వయసు నుంచే క్రియాశీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ ముక్కుసూటి మనిషి. నక్సలైట్లతో చర్చలు జరిపి జనజీవన స్రవంతిలోకి తేవడంలో రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 40 లక్షల ఎకరాల భూమికి నీరు అందించే జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి. ఉచిత విద్యుత్ పథకం వైఎస్సార్ మానసపుత్రికే. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఆయన చలవే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన విధానాలను అమలు చేస్తున్నారు. వైఎస్సార్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. శత్రువులు కూడా మెచ్చుకునే గుణం వైఎస్సార్ సొంతం. ఆయన చనిపోవకుండా ఉండి ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి. బీజేపీ తీసుకొచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో దర్నా చేసేవారు. వైఎస్సార్ లేకపోతే 2004, 2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడేది కాదు” అంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. “రాజశేఖర్ రెడ్డితో నేను రాజకీయంగా విభేదించవచ్చు. కానీ, ఆయన తీసుకొచ్చిన ఆర్థిక, వ్యవసాయ విధానాలు అందరికీ ఆదర్శం. దీర్ఘకాలం పోరాడి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాబట్టి.. అందరి అభిప్రాయాలను గౌరవించేవారు. నేను హైకోర్టు జస్టిస్ గా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా.. రాజ్యాంగ వ్యవస్థలు ఒత్తిడి చేయలేదు. జాతీయ పార్టీలకు ప్రాంతీయ ప్రయోజనాలు అవసరం లేదా అని వైఎస్సార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ఉచిత విద్యుత్ మేనిఫెస్టోలో చేర్చారు” అంటూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.

Show comments