Idream media
Idream media
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయాయి. వైఎస్.జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించింది. ఫ్యాను గాలికి ప్రతిపక్షాలు పత్తా లేకుండాపోయాయి. 175 సీట్లలో 151 గెలిచి విజయం సాధించింది వైసీపీ. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలను పూర్తిగా కైవసం చేసుకుంది. రాయలసీమ లో మూడు సీట్లు తప్ప (కుప్పం, హిందూపూర్, ఉరవకొండ) అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవైమూడు సీట్లకు పరిమితమైంది. పార్టీ చరిత్రలో అత్యంత తక్కువ స్థానాలు అవే. టీడీపీ ప్రముఖులెందరో ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. గత మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రమే గెలుపొందారు. జనసేన కూటమి రాజోలులో మాత్రమే గెలిచింది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాలు రెండింటిలోనూ ఓడిపోయారు. కాంగ్రెస్ , బీజేపీల ప్రాతినిధ్యం శూన్యం. ఇలా ఎన్నో రికార్డులకు గత ఎన్నికలు నాంది పలికాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ అంతకుమించే రికార్డులు సృష్టించేందుకు వైసీపీ భారీ ప్రణాళికలు రచిస్తోంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచే జగన్ పాలనలో పట్టుసాధిస్తూ ముందుకు సాగిస్తున్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ఉత్తమ సీఎంగా గుర్తింపు పొందారు. పాలనాపరమైన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ పటిష్టత, నేతల్లో ఉత్సాహం పెంచేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. కొత్త కొత్త పదవులను సృష్టించారు. ఇక పాలనాపరంగా జగన్ తీసుకుంటున్న అద్భుత నిర్ణయాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పరిస్థితి ఎలా మారిందంటే.. ఎన్నికలు ఏవైనా ఫ్యాను సింబల్ కనిపించిందంటే.. ప్రజలు ఓటు గుద్దేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీపై మరింత దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లో మరో చరిత్ర ఖాయమని వైఎస్.జగన్ గుర్తించినట్లున్నారు. కార్యాచరణ ప్రారంభించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి సీటు కూడా కదిలిపోయే రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఏపీలో ఉన్నాయి. ఇదే ఊపుతో వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయేలా జగన్ వ్యూహరచన చేస్తున్నారు. తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం జగన్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘రాబోయే రెండేళ్లు ప్రజల్లోనే ఉందాం. జనంతో మమేకమవుతూ.. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిద్దాం. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం’ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేశారు. వీలైనంత త్వరలోనే వైఎస్సార్‌ఎల్పీ సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలకు భవిష్యత్ కార్యాచరణ వివరిస్తానని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ‘గత ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో అంతకుమించే విజయాలు సాధించేలా పనిచేయాలి’ అని జగన్ మంత్రులతో పేర్కొన్నారు.