Idream media
Idream media
జగన్ రెడ్డి బతుకంతా అబద్ధాల మయం. సింహాలుగా తమ చరిత్ర తాము చెప్పకోకపోతే.. గుంటనక్కలు చెప్పే కట్టుకథలే వాస్తవాలుగా చెలామణి అవుతాయి. టీడీపీ చేసిన సంక్షేమాన్ని కూడా జగన్ రెడ్డి నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. చిరుద్యోగుల జీతాలపై సీఎం స్థాయిలో అబద్ధాలు ఆడుతున్నారు… ఇదీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు తాజాగా తాపీగా వదిలిని ప్రెస్‌నోట్.
అచ్చెం నాయుడు అన్నట్లుగా.. సింహాలు తమ చరిత్ర తాము చెప్పకోకపోతే గుంటనక్కలు చెప్పే కట్టు కథలే వాస్తవాలుగా చెలామణి అవుతాయి. టీడీపీ ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలోని చిరు ఉద్యోగులకు జీతాలు ఎంత మొత్తం చెల్లిస్తున్నారు..? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎంతెంత జీతాలు ఇస్తున్నారు..? అనే విషయాలు వైసీపీ సర్కార్ చెప్పకపోతే.. టీడీపీ నేతలు చెప్పే అబద్ధాలే నిజాలుగా చెలామణి అవుతాయి.
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సచివాలయ వ్యవస్థ ద్వారా 1.20 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. ఇవి గాక.. చిరు ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచింది. అయినా టీడీపీ అజెండా మోస్తున్న కమ్యూనిస్టులు.. ఉద్యోగులను రెచ్చగొడుతూ ఆందోళనలు చేస్తుండడంతో అసలు విషయాన్ని సీఎం జగన్ ఈ నెల 8వ తేదీన జగనన్న చేదోడు పథకం నగదు జమ చేసే కార్యక్రమంలో వివరించారు. లేకపోతే అచ్చెం నాయుడు అన్నట్లు.. గుంటనక్కలు చెప్పే అబద్ధాలే వాస్తవాలుగా చెలామణి అయ్యేవి.
చిరుద్యోగుల జీతాలు.. వాస్తవాలు ఇవిగో..
2019కి ముందు అంగన్‌వాడీ వర్కర్ల జీతం ఏడు వేల రూపాయలు కాగా, వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆ మొత్తం 11,500 రూపాయలకు పెంచి ఇస్తోంది. మినీ అంగన్‌వాడీ వర్కర్లకు 4,500 రూపాయలు కాగా 7 వేల రూపాయలకు పెంచింది. సంఘమిత్రలు, యానిమేటర్లకు మూడు వేల రూపాయలు ఇస్తే.. వైసీపీ వచ్చాక పది వేల రూపాయలు చేసింది. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల జీతం 12 వేల రూపాయల నుంచి 18 వేల రూపాయలు చేసింది. ఆశా వర్కర్లకు మూడు వేల రూపాయలు కాగా.. వైసీపీ వచ్చాక పది వేల రూపాయలు ఇస్తున్నారు. గిరిజన సంక్షేమ వర్కర్లకు టీడీపీ హాయంలో కేవలం నాలుగు వందల రూపాయలు ఇవ్వగా.. వైసీపీ వచ్చాక నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు. హోం గార్డులకు 18 వేలు కాగా 21,300 రూపాయలు ఇస్తున్నారు. 108 వ్యవస్థలోని డ్రైవర్లకు నెలకు 13 వేల రూపాయలు అయితే.. ఇప్పుడు 28 వేల రూపాయలు ఇస్తున్నారు. ఈ గణాంకాలు చదివిన తర్వాత చిరుద్యోగుల జీతాల పెంపుపై సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారా..? లేదా..? అనేది అచ్చెం నాయుడే చెప్పాలి.