Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తొలిసారి చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో భాగంగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టై నేటికి ఆరు రోజులు గడుస్తోంది. ఇప్పటివరకు చంద్రబాబు అరెస్టుపై మాట్లాడని సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిడవదోలు సభలో దీనిపై స్పందించారు. అవినీతి కేసులో.. పక్కా ఆధారాలతో చంద్రబాబు అరెస్టయ్యారని తెలిపారు. చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తిని కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారంటూ సీఎం జగన్ మండి పడ్డారు. చట్టం ఎవరికైనా ఒక్కటే.. దాని ముందు అందరూ సమానమే అని స్పష్టం చేశారు సీఎం జగన్.
ఈ కేసులో కోర్టు.. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు చూసి చంద్రబాబును అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు సీఎం జగన్. స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని.. దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు.. పీఏ నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలిపారు. కోర్టులో సుమారు పది గంటల పాటు వాదనలు జరిగాయని.. బాబుకు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సరైన ఆధారాలతోనే నోటీసులు ఇచ్చారని జగన్ స్పష్టం చేశారు. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టయ్యారని.. ప్రశ్నిస్తానన్న వ్యక్తి ప్రశ్నించడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం జగన్. అవినీతి పరుడికే మద్దతిస్తున్నారంటూ పవన్‌పై మండి పడ్డారు.
గతంలో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని సీఎం జగన్ మరోసారి గుర్తు చేశారు. ఆ ఆడియో టేపులో ఉన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ సర్టిఫికేట్ ఇచ్చినా.. కొందరు బాబు చేసింది నేరమే కాదని వాదించేందుకు సిద్ధమయ్యారన్నారు. గజదొంగను కాపాడేందుకు దొంగల ముఠా ప్రయత్నిస్తోందని.. అవినీతిపై ఆధారాలు కనిపిస్తున్నా బుకాయిస్తారన్నారు. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ సీఎం జగన్ విమర్శల వర్షం కురిపించారు.