ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ రోజు బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఓ సీనియర్ మంత్రి.. ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ‘‘ అన్నా మీకు ఇదే చివరి బడ్జెట్’ అంటూ సరదాగా అన్న వ్యాఖ్యలతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. ఈ సమయంలో కలుగజేసుకున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముందే అనుకున్నదే కదా అంటూ గుర్తు చేశారు. అదే సమయంలో ప్రస్తుత మంత్రుల సేవలను ఎలా ఉపయోగించుకునేది, వారికి భవిష్యత్‌లో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని కూడా సీఎం జగన్ సమావేశంలో స్పష్టతనిచ్చారు.
మంత్రివర్గం ఏర్పాటు చేసే సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత దాదాపు మంత్రివర్గ విస్తరణ చేపడతామని, మిగిలిన వారికి అవకాశం ఇస్తామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. మంత్రివర్గం కొలువుదీరి రెండున్నరేళ్లు ముగిసింది. పోయిన దసరాకే ముహూర్తం అనుకున్నా.. వివిధ కారణాలతో అది వాయిదాపడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చిందని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.
జిల్లా అధ్యక్ష బాధ్యతలు..
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత కేబినెట్‌లో దాదాపు అందరూ కొత్తవారే ఉండే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత మంత్రులకు అందరికీ పార్టీ బాధ్యతలు అప్పగించే యోచనలో సీఎం జగన్ ఉన్నారు. ఏప్రిల్ నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలు కాబోతోంది. ప్రస్తుత మంత్రులకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయా నేతలు పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతగా బాధ్యలు నిర్వర్తిస్తారనే భావనతో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
గెలిచాక మళ్లీ కేబినెట్‌లోకి..
ఇప్పుడు మంత్రి పదవుల నుంచి తప్పుకుంటూ.. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోయే వారికి భవిష్యత్‌లో మంచి ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామనే హామీని సీఎం జగన్ సమావేశంలో ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా బడ్జెట్ సమావేశాల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై క్లారిటీ వచ్చింది. సామాజిక సమీకరణాల ప్రతిపాదికన మంత్రి పదవులు కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో వైసీపీలో సందడి నెలకొంది. ఆయా జిల్లాల్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ మొదలైంది.