Dharani
Dharani
తెలంగాణలో ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. పార్టీలన్ని.. అసెంబ్లీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఇక అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి.. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల చేశారు. దీనిలో సుమారు 115 మందికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. తొలి జాబితాలో.. ఎక్కువ శాతం సిట్టింగులకే అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. దాంతో ఇన్ని రోజులుగా టికెట్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆశావహులను బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇక రేపో, ఎల్లుండో కేబినెట్‌లో మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారట సీఎం కేసీఆర్.
ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆయన స్థానం ఖాళీగానే ఉంటోంది. ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి లేదా ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌కో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నుంచి టికెట్ ఆశించగా.. మళ్లీ రోహిత్ రెడ్డికే ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఆయనను కేబినేట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు.. కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్.. కేసీఆర్ కోసం తన స్థానాన్ని వదులుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కూడా ఈ మూడు నెలల్లో సరైన గౌరవం ఇచ్చి సంతోషపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే ఒకేసారి వీరిద్దరిని కేబినెట్‌లోకి తీసుకోవాలంటే.. ఇప్పటికే ఉన్న ఒకరిని తప్పించక తప్పని పరిస్థితి. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్‌లో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. కాగా.. మళ్లీ పట్నం మహేందర్ రెడ్డిని తీసుకుంటే.. ఆ సంఖ్య నాలుగుకు చేరనుంది. దీంతో.. ఓ రెడ్డి మంత్రికి ఉద్వాసన పలకనున్నారు.
ఇప్పటికే కేసీఆర్ మంత్రి వర్గంలో రెడ్డి వర్గానికి చెందిన..సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డిలు ఉన్నారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుంటే .. సమీకరణాలు మారుతాయి కాబట్టి ఓ రెడ్డి మంత్రిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఎన్నికలకు మూడు నెలలే ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించి మంత్రి పదవి నుంచి తప్పుకోమనే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అంతేకాక.. మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి.. ఇద్దరిదీ రంగారెడ్డి జిల్లానే కావటంతో.. ఇక ఆమెనే తప్పించనున్నారా అన్నది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.