iDreamPost
android-app
ios-app

క‌లెక్ట‌ర్ల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క సూచ‌న‌లు

క‌లెక్ట‌ర్ల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క సూచ‌న‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త జిల్లాల్లోని పాల‌న‌పై దృష్టి సారించారు. జిల్లాల ఏర్పాటు త‌ర్వాత ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారు. ఎక్క‌డ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తినా వెంట‌నే ప‌రిష్కారమార్గాల‌ను చూపుతున్నారు. క‌లెక్ట‌ర్, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌కు త‌గిన ఆదేశాలు జారీ చేస్తూ ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు స‌జావుగా సాగాలంటే అధికారుల పాత్ర కీల‌కం. అందుకే జ‌గ‌న్ అధికార యంత్రాంగంపై ప్ర‌ధాన దృష్టి కేంద్రీక‌రించారు. నిరంతరం వారితో స‌మీక్ష‌లు జ‌రుపుతున్నారు. గ్రామ సచివాలయాలు న‌డుస్తున్న తీరును తెలుసుకుంటున్నారు. ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్, డిజిటిల్‌ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు-నేడు, స్పందన కింద ఆర్జీలకు పరిష్కారం.. ఇలా ప్ర‌తీ అంశంపైనా దృష్టి సారిస్తున్నారు. అధికారుల నుంచి వ‌చ్చిన స‌మాచారాన్ని ప‌రిశీలించి కీల‌క ఆదేశాలు జారీ చేస్తున్నారు.

తాజా స‌మీక్ష‌లో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలియాలన్నారు. ‘‘పరిపాలన అనేది సులభతరంగా ఉండాలి. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి. మరింత మానవీయ దృక్పథంతో ప్రజల పట్ల ఉండాలి. ఈ విషయాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ’’ సీఎం సూచించారు.

“ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ముమ్మరంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కనీసం 60 శాతం పనులను ఈనెలల్లో చేయాలి. కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా పనిచేయడంపై దృష్టి పెట్టాలి. ప్రతిజిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం లక్ష పని దినాలు చేయాలి. నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో లక్ష్యాలు పెట్టుకుని ఉపాధిహామీ పనులు చేపట్టాలి. విస్తృతంగా పర్యటనలు చేసి, సమీక్షలు చేసి… ఈ లక్ష్యాలను సాధించాలి. కోర్టు కేసుల కారణంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలి. ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి. ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో ఆర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్‌డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు… ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం..” అని వెల్ల‌డించారు.