iDreamPost
android-app
ios-app

ఓటమి పాలైన యోధానుయోధులు

ఓటమి పాలైన యోధానుయోధులు

ఒకరు తాజా ముఖ్యమంత్రి… మరొకరు మాజీ ముఖ్యమంత్రి… ఇంకొకరు పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇలా అందరూ యోధానుయోధులే. అయితేనేమి ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. తాజాగా జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పునకు హేమాహేమీలు ఓటమి చవిచూశారు. ఆమాద్మీ పార్టీ ప్రభజనంలో మట్టి కొట్టుకుపోయారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ తాను పోటీ చేసిన రెండుచోట్ల ఆప్‌ పార్టీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. బహదూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం లో ఆయన ఆప్‌ పార్టీ అభ్యర్థి లాబా సింగ్‌ చేతిలో ఏకంగా 37 వేల 567 పైచిలుకు ఓట్లు తేడాతో ఓటమి చవిచూడడం విశేషం. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ ఆప్‌ పార్టీ ఆయన పోటీచేసిన మరోస్థానం చముకూర్‌ సాహెబ్‌ నియోజకవర్గంలో సైతం ఆయన ఓటమి పాలయ్యారు. ఇక్కడ ఆప్‌ పార్టీ అభ్యర్థి చరణ్‌జీత్‌ సింగ్‌ చేతిలో ఆయన 7 వేల 942 ఓట్ల తేడా ఓడిపోయారు. ఒక ముఖ్యమంత్రి పోటీ చేసిన రెండు స్థానాల్లోను ఓటమి పాలవడం దేశ రాజకీయాల్లో చరణ్‌జీత్‌ సింగ్‌ చిన్నీ పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రి కావడం ఇక్కడ గమనార్హం. ఆ వర్గం ఓట్లు అధికంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడం కాంగ్రెస్‌ పార్టీకి జీర్ణించుకోలేని అంశంగా మారింది.

మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ సైతం ఎమ్మెల్యేగా ఓటమి చవిచూశారు. ఆయన పాటియాలా అర్బన్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ రెండవ స్థానంలో నిలవగా కెప్టెన్‌ మూడవస్థానానికే పరిమితమయ్యారు. ఈ స్థానంలో అమరేంద్ర సింగ్‌ గత ఎన్నికల్లో 52 వేల 407 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇదే స్థానం నుంచి ఆయన 2002, 2007, 2012లో గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే కెప్టెన్‌కు ఈ నియోజకవర్గం కంచుకోట. అటువంటి చోట ఆయన మూడవస్థానంలో నిలవడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆప్‌ ప్రభంజనంలో ఓటమి చవిచూసిన మరో కీలక నేత శిరోమణి అకాలీదళ్‌ అధినేత సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌. మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కుమారుడు. ఫిరోజ్‌ పురా నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుదామని కలలుకన్నారు కాని ఎమ్మెల్యేగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆయన పోటీ చేసిన జలాలాబాద్‌ నియోజకవర్గంలో ఆప్‌ పార్టీ అభ్యర్థి జగదీప్‌ కాంబోజీ చేతిలో ఏకంగా 16 వేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్‌ ప్రభనంలో అగ్రశ్రేణి నాయకులంతా ఓటమి పాలయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి