Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చిట్ చాట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత చరిత్రలో చూడలేదని పేర్కొన్నారు. టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న 1994లో కూడా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత చంద్రబాబు చూడలేదట. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయట.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చెప్పారు. విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ఏపీలో ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తున్నారో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల ద్వారా నిరూపితం అయినా ఆయన ఇలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడం.
అబద్దాన్ని పదే పదే చెప్పేస్తే.. అదే నిజమని ప్రజలు నమ్ముతారని చంద్రబాబు నమ్మకం ఏంటో తెలియదు కానీ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 13095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతో పాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే.. అందులో 2199 సర్పంచి పదవులకు, 48022 వార్డు సభ్యులకు ఏకగ్రీవం గా ఎన్నికలు జరిగాయి. అయితే 2001 గ్రామాల్లో ఎన్నికల ఊసే లేకుండా వైసీపీ సానుభూతుపరులకు ప్రజలు పట్టం కట్టారు. అవి పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాకపోవడంతో.. టీడీపీ కూడా మసిబూసి మారేడు కాయ చందాన తమ ఖాతాలో కూడా చాలా సీట్లు సంపాదించి ప్రచారం చేసుకుంది.
ఆ వెంటనే పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో అనేది తేటతెల్లమైంది. రాష్ట్రంలోని 12 కు 12 కార్పొరేషన్ లను వైసీపీ గెలిచి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా.. 75 మునిసిపాలిటీ లలో 74 సాధించింది. ఆ ఒక్కటి అయిన తాడిపత్రి లో కేవలం 2 వార్డులు తక్కువ తో వైసీపీ ఓడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. చివరకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ జెండానే ఎగిరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్లు రాగా, మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి 52.63 శాతం ఓట్లు వచ్చాయి. అంటే రెండేళ్లలో ఓట్ల శాతాన్ని వైసీపీ మరింత పెంచుకుంది. ఇక ఆ తర్వాత మరింత రెట్టించిన ఉత్సాహంతో జగన్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.
ప్రధానంగా కరోనా వంటి తీవ్ర విపత్తు కాలంలో కూడా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా నగదు బదిలీ వంటి పథకాలు ఆదుకున్నాయి. ఆర్థిక నిపుణులు కూడా జగన్ విధానాలను భేష్ అన్నారు. జగన్ అనుసరిస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ దక్కుతున్నాయి. ఇవన్నీ నోట మాటలు కాదు. ఉత్త ప్రచారాలు కాదు. లెక్కలు, ఆధారాలతో సహా కనిపిస్తున్న సాక్షీభూతాలు. అయినప్పటికీ ఏపీలో జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఆయన విధానాలతో జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి.. వంటి స్టేట్ మెంట్లు ఇవ్వడం చూస్తుంటే.. చంద్రబాబు ఊహల లోకంలో విహరిస్తున్నట్లే కనిపిస్తోంది. ఆయన వాస్తవ పరిస్థితులను గుర్తించి దానికనుగుణంగా విధానాలు మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో గతం కంటే ఘోర వైఫల్యాలను చవి చూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.