258 కోట్ల విరాళాల్లో 212 కోట్లు బీజేపీకే..!

భారతీయ జనతా పార్టీ మరో రికార్డు నెలకొల్పింది. ఒక్క ఏడాది అత్యధిక డొనేషన్లు పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ కొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది రాజకీయ పార్టీలకు అందిన విరాళాల లెక్కలు చూస్తే దేశవ్యాప్తంగా 12 ప్రధాన పార్టీలకు మొత్తం రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీనే రూ.212 కోట్లు డొనేషన్లు రాబట్టింది. మొత్తం రాజకీయ పార్టీలకు అందిన విరాళాలలో ఒక్క బీజేపీకే 82 శాతం వాటా దక్కింది.

బీజేపీ తర్వాత రూ.27 కోట్లు విరాళాల‌తో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. ఇది 10.45 శాతానికి సమానం. కాగా, దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా, దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీతో సహా ఎన్పీపీ, ఏఐఏడీఎంకే, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎల్పేజీ, సీపీఎం, సీపీఐ, ఎల్జేపీలకు కలిపి మొత్తం రూ.19 కోట్లే విరాళంగా అందాయి. ఈ మేరకు ఎలక్టోరల్ ట్రస్టులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాయని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్ (ఏడిఆర్) వెల్లడించింది.

దేశంలో మొత్తం 23 ఎలక్టోరల్ ట్రస్టులు ఉండగా.. వాటిలో 16 ట్రస్టులు ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాయి. ఈ రిపోర్ట్స్ చూస్తే గత మూడేళ్లుగా బీజేపీ విరాళాల సేకరణతో పాటు ధనిక పార్టీగా అవతరించింది. అధికారంలో ఉన్న బీజేపీ ఏడాదికి ఏడాది ఆర్థికంగా కూడా అత్యధిక బలం కల్గిన పార్టీగా అవతరిస్తోంది. ఇప్పటికే ఆస్తుల విషయంలో మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తాచాటిన బీజేపీ విరాళాలతో ఏటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోందని తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది.

Show comments