iDreamPost
android-app
ios-app

గుజ‌రాత్ కు మోడీ.. ఎన్నిక‌లు సమీపిస్తున్న వేళ ఆస‌క్తిక‌రం..

గుజ‌రాత్ కు మోడీ.. ఎన్నిక‌లు సమీపిస్తున్న వేళ ఆస‌క్తిక‌రం..

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి, గుజ‌రాత్ కు విడ‌దీయ‌లేని బంధం ఉంది.ఆయ‌న అక్క‌డ‌కు వెళ్ల‌డం,రావ‌డం మామూలుగా అయితే వార్త కాదు.. కానీ.. ఈ ఏడాది చివ‌ర‌లో అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డం, ఇప్ప‌టికే ఆప్ చూపు ఆ రాష్ట్రంపై ప‌డిన నేప‌థ్యంలో మోడీ తాజాప‌ర్య‌ట‌న ఆస‌క్తిగా మారింది.

ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో ఎన్నిక‌ల రాజ‌కీయాలు
మొద‌ల‌య్యాయి. కాంగ్రెస్‌ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్‌ పటేల్‌ ఏకంగా అధినాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తనను పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని జాతీయ పత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే.. ఇటీవ‌ల ఆప్ అధినేత అక్క‌డ రెండురోజుల పాటు ప‌ర్య‌టించారు. స్థానికంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు వ్యూహర‌చ‌న చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీకూడా దృష్టి సారించింది. 27 ఏళ్లుగా నిలబెట్టుకుంటున్న అధికారాన్ని మరోసారి చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఈ క్ర‌మంలో ప్రధాని మోడీ సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. గాంధీనగర్‌లోని స్కూళ్ల కోసం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం బానస్‌ డైరీ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత జాంనగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. సాంప్రదాయ ఔషధాల కోసం ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ సెంటర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గుజరాత్‌లోని మరోబిలో ఏర్పాటు చేసిన 108 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని హనుమాన్‌ జయంతి సందర్భంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ప్రారంభించనున్నారు.

ఇటీవ‌ల‌ సబర్మతి ఆశ్రమం సంద‌ర్శించిన కేజ్రీవాల్ అహ్మదాబాద్‌ వీధుల్లో తిరంగాయాత్ర పేరిట రోడ్ షో నిర్వ‌హించారు. ఒకే ఒక్క చాన్స్ అంటూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. గుజ‌రాత్ లో 25 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. గుజ‌రాత్ లో అవినీతిని రూపుమాపేందుకే ఇక్కడికి వచ్చానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆప్ కు ఒక అవ‌కాశం ఇస్తే ఢిల్లీ, పంజాబ్‌ ల మాదిరిగా గుజ‌రాత్ ను తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల అనంత‌రం మోడీ ఏం మాట్లాడ‌నున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.