iDreamPost
android-app
ios-app

అవినీతి అంతానికి జ‌గ‌న్ కొత్త పంథా

అవినీతి అంతానికి జ‌గ‌న్ కొత్త పంథా

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రాక ముందు.. విప‌క్షాలు ఆయ‌న‌పై ఎన్నో ఆరోప‌ణ‌లు చేసేవి. వాటిలో ఒక‌టి అవినీతి. ఆయ‌న అధికారంలోకి వ‌స్తే అవినీతి పెరిగిపోతుంద‌ని ప‌నిక‌ట్టుకుని మ‌రీ ప్ర‌చారం చేశాయి. ఇప్పుడూ చేస్తున్నాయి. కానీ.. జ‌గ‌న్ ప‌నితీరు అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తోంది. సంక్షేమ ప‌థ‌కాల కోసం ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు ల‌క్షా న‌ల‌భై వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసినా ఎక్క‌డా అవినీతి బ‌య‌ట‌ప‌డలేదు. అవినీతి పై ఆందోళ‌న‌లు లేవు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ప్రమాణికంగా లబ్ధిదారుల ను ఎంపిక చేస్తోంది జ‌గ‌న్ స‌ర్కార్. అవినీతి, లంచాలకు ఆస్కారం లేకుండా, దుర్వినియోగం అనే మాట వినిపించకుండా ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రాక‌ముందే త‌న ఎజెండా ఏంటో స్ప‌ష్టంగా చెప్పారు. అవినీతిలేని పాల‌న అందించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. ఆ దిశ‌లో కొత్త కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అమ్మఒడి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్ళు, ఫీజు రీయింబర్స్ మెంట్, వైఎస్సార్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్సార్ ఆసరా – వైఎస్సార్ చేయూత, అందరికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా వంటి న‌వ‌ర‌త్నాల ద్వారా కోట్లాది మందికి ల‌బ్ధి చేకూర్చినా.. ఎక్క‌డా అవినీతి జ‌ర‌గ‌కుండా ప‌క్కాగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి అవినీతి అంతానికి ప్ర‌త్యేక యాప్ ప్ర‌వేశ‌పెట్టారు.

దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్‌ తేవాలని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ యాప్‌ ద్వారా బాధితులు ఆడియో ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్‌ చేయాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్‌ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్‌ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని చెప్పారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని తెలిపారు. మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలించేయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ద్ద అవినీతిపై ఫిర్యాదు చేయాల‌నుకుంటే.. చేయాల్సిన నంబ‌ర్ల‌ను డిస్ ప్లే చేయాల‌ని జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. చాలా చోట్ల ఆ నెంబ‌ర్లు క‌నిపిస్తున్నాయి. ఎవ‌రైనా బాధితులు ఫోన్ చేస్తే త‌క్ష‌ణ‌మే స్పందించేలా ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ను రూపొందించారు. అవినీతి వ్య‌వ‌స్థ ను రూపు మాప‌డం కేవ‌లం అధికార కార్య‌క‌లాపాల‌కే జ‌గ‌న్ ప‌రిమితం చేయ‌లేదు. రాజ‌కీయాల్లోనూ కొత్త ఒర‌వ‌డిని సృష్టించారు. ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచ‌డం, తాయిలాలు ఆశ పెట్ట‌డం వంటి వాటికి దూరంగా ఉండాల‌ని వైసీపీ శ్రేణుల‌ను ఆదేశించారు. ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌గ‌న్ బ‌హిరంగంగా పార్టీ నేత‌ల‌కు ఆ ప్ర‌క‌ట‌న చేశారు. ఇలా అవినీతి అంతానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్ని ర‌కాలుగానూ ప్ర‌య‌త్నిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారు.