ఐల్యాండ్‌ ఇవ్వలేదని ఆ దేశం మా ప్రభుత్వాన్ని కూల్చింది: బంగ్లాదేశ్‌ మాజీ PM హసీనా

America, Bangladesh, Sheikh Hasina: తనకు చెందిన ఒక ఐల్యాండ్‌ను ఇవ్వనందుకే ఆ దేశం తమ ప్రభుత్వాన్ని కూల్చేసిందని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆరోపించారు. మరి ఆ దేశం ఏదో ఏ ఐల్యాండ్‌ కోరిందో ఇప్పుడు తెలుసుకుందాం..

America, Bangladesh, Sheikh Hasina: తనకు చెందిన ఒక ఐల్యాండ్‌ను ఇవ్వనందుకే ఆ దేశం తమ ప్రభుత్వాన్ని కూల్చేసిందని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆరోపించారు. మరి ఆ దేశం ఏదో ఏ ఐల్యాండ్‌ కోరిందో ఇప్పుడు తెలుసుకుందాం..

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల తర్వాత.. ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఇండియాకు వచ్చి తలదాచుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆమె బంగ్లాదేశ్‌లోని తన పార్టీ కేడర్‌ కోసం ఒక లేఖ రాశారు. అందులో సంచలన విషయాలు వెల్లడించారు. తమ ప్రభుత్వాన్ని అమెరికా కూల్చినట్లు ఆరోపించారు. అందుకు కారణం కూడా ఆమె వెల్లడించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసే ముందు తాను.. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడలని అనుకున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

కానీ, అప్పటికే ఆందోళనకారులు అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడంతో.. భద్రతాధికారులు అత్యవసరంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో తాను చెప్పాలనుకున్న విషయాన్ని తన దేశ ప్రజలకు చెప్పలేకపోయానంటూ ఆమె పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కి దక్షిణాన బే ఆఫ్‌ బెంగాల్‌కి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న సెయింట్‌ మార్టిన్‌ ఐల్యాండ్‌ని తమకు అప్పగించాలని అమెరికా తనను కోరిందని.. అందుకునే తాను అస్సలు ఒప్పుకోలేదని హసీనా తెలిపారు. తాను ఐల్యాండ్‌ ఇవ్వలేదనే కోపంతోనే.. ప్రతీకారంగా దేశంలో అల్లర్లు సృష్టించి.. అమెరికా తమ ప్రభుత్వాన్ని కూల్చేసిందని హసీనా ఆరోపించారు.

అమెరికా కోరినట్లు నేను ఐల్యాండ్‌ అప్పగించి ఉంటే.. దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె అన్నారు. దేశంలో వాళ్లు సృష్టించిన అల్లర్ల కారణంగా బలవుతున్న ప్రాణాలను చూసి తట్టుకోలేకే తాను రాజీనామా చేశానని తెలిపారు. అమెరికా ప్రతిపాదనకు తాను ఒప్పుకొని ఉంటే తనకు రాజీనామా చేసే అవసరం వచ్చి ఉండేది కాదని కూడా వెల్లడించారు. అయినా కూడా తమ పార్టీ ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొని మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కేడర్‌ విశ్వాసం కోల్పోవద్దని కోరారు. ప్రస్తుతానికి తాను ఓడిపోయి ఉండొచ్చు కానీ, బంగ్లాదేశ్‌ గెలిచిందంటూ హసీనా భావోద్వేగపూరిత సందేశం పంపించారు. తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని కూడా హసీనా వెల్లడించారు. మరి ఆమె అమెరికాపై చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments