Idream media
Idream media
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడే ముందుకు సాగుతోంది. మూడు రాజధానుల్లో భాగంగా గతంలో కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం ఆ అంశం అధికారికంగా పెండింగ్ లో ఉంది. కానీ.. సర్కారు వేస్తున్న అడుగులు పరిశీలిస్తే అనుకున్నది సాధించేలా కనిపిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఇంతకుముందే ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడది శాశ్వత భవనంలోకి మారింది. ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్‌లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు.
అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పటికీ కొత్తగా కర్నూలులో కార్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించి న్యాయపరమైన అంశాలను వక్ఫ్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో తెలంగాణకు 60 శాతం, ఏపీకి 40 శాతం చొప్పున కేటాయించారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను అమరావతిలో కాకుండా కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆదేశాలిచ్చారు.
వక్ఫ్ భూములు, వాటి వివాదాలను త్వరితగతిన విచారించి పరిష్కరించడంలో ట్రిబ్యునల్ కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. హైదరాబాద్‌లోని వక్ఫ్ ట్రిబ్యునల్‌కే ఏపీ కేసులనూ పంపిస్తున్నారు. అయితే అక్కడ విచారణ వేగంగా జరగడం లేదు. ఫలితంగా ఏపీకి చెందిన వక్ఫ్ భూముల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇలా దాదాపు 400 నుంచి 450 కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి పెండింగ్ కేసులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గతంలో మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌లో ఉండేది. తాజాగా కర్నూలు సంతోష్ నగర్ లో లోకాయుక్త నూతన కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు. వేదపండితులు పూర్ణకుంభంతో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డికి స్వాగతం పలికారు. లోకాయుక్త సంస్థ చైర్మన్ ఛాంబర్ లో ఆసీనులై వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. లోకాయుక్త రిజిస్ట్రార్ విజయలక్ష్మి, లోకాయుక్త ఐజి నరసింహారెడ్డి, డైరెక్టర్ లీగల్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, డిప్యూటీ డైరెక్టర్ లీగల్ మురళీ మోహన్ రెడ్డి, లోకాయుక్త సంస్థ డీఎస్పీలు పాల్గొన్నారు. లోకాయుక్త సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.
మూడు రాజధానుల్లో భాగంగా న్యాయ రాజధానిగా భావించిన కర్నూలులో సంబంధిత కార్యాలయాల ఏర్పాట్లు ఇప్పటికీ కొనసాగుతుండడం ఆసక్తికరంగా మారింది. బిల్లు ఉపసంహరణ ప్రకటించిన రోజే.. ఈసారి పకడ్భందీగా మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తామని ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటించారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో ఏపీ సర్కారు ఆ దిశగా కసరత్తు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.