iDreamPost
iDreamPost
సుమారు రెండు నెలలుగా ఉక్రెయిన్ పై కమ్ముకున్న యుద్ధ మేఘాలు బాంబుల వర్షం కురిపించడం ప్రారంభించాయి. బుధవారం అర్థరాత్రి యుద్ధ శంఖారావం మోగించిన రష్యా దళాలు వరుస దాడులకు పాల్పడుతూ ఉక్రెయిన్ లోని తమ లక్ష్యాలను నాశనం చేస్తున్నాయి. రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడించినట్లు వార్తలు వస్తున్నాయి. వందలాది మంది మృతి చెందారు. రష్యా దాడులను అమెరికా, యూరోప్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రతీకారంగా రష్యాపై ఆంక్షలు ప్రకటిస్తున్నాయి. ఈ యుద్ధం, ఆంక్షల ప్రభావం ప్రపంచంతో పాటు మనదేశంలో చమురు సంక్షోభానికి దారితీయవచ్చన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అదే జరిగితే ప్రస్తుతం దేశంలో కాస్త స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగి అవకాశం ఉంది.
ప్రపంచ చమురు మార్కెట్లో రష్యా వాటా 10 శాతం
ఉక్రెయిన్, రష్యా మధ్య సుమారు రెండు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్షకుపైగా బలగాలను మోహరించడం.. ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా నేతృత్వంలో నాటో దేశాలు నిలవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. చివరికి రష్యా యుద్ధం ప్రారంభించడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ యుద్ధ ప్రభావం చమురు సంక్షోభం రూపంలో ప్రపంచం మొత్తం మీద పడుతుంది. ప్రపంచానికి అవసరమైన చమురు, గ్యాస్ ఉత్పత్తుల్లో 10 శాతం రష్యా నుంచే సరఫరా అవుతోంది. రష్యా నుంచి యూరప్ దేశాలు గ్యాస్ అధికంగా ఎగుమతి అవుతుండగా, మన దేశం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. రష్యా యుద్ధానికి దిగడంపై ఆగ్రహంతో ఉన్న అమెరికా, యూరప్ దేశాలు దానిపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీనికి ప్రతిగా.. అలాగే తన అవసరాల కోసం ముందు జాగ్రత్తగ్స్ రష్యా కూడా ఆయా దేశాలకు ఆయిల్ ఎగుమతులు నిలిపివేసి అవకాశం ఉంది. రష్యా ఎగుమతులు నిలిపివేస్తే.. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రపంచ దేశాలు మిగిలిన ఓపెక్ దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఫలితంగా డిమాండ్, కొరత పెరుగుతాయి. ఇదే అదనుగా ఓపెక్ దేశాలు క్రూడ్ ఆయిల్ ధరలు పెంచేసే ప్రమాదం ఉంది. గత రెండు నెలల ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర తొలిసారి 100 డాలర్లు దాటింది. ఇది మరింత పెరగవచ్చంటున్నారు.
త్వరలో ధరాఘాతం
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మనదేశంలో రోజువారీ ధరల సమీక్ష, సవరణ విధానం అవలంబిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ఏరోజుకారోజు ధరలు పెంచుతున్నాయి. అయితే అయిదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యాన దాదాపు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్ణయం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ.110 పలుకుతోంది. ఎన్నికల వల్ల కొన్ని రోజులుగా పెరగలేదు. ఈ తరుణంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావం మన దేశ ఆయిల్ దిగుమతులపై తీవ్రంగా పడుతుంది. మన దేశ అవసరాలను 80 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. యుద్ధ ప్రభావం కచ్చితంగా ఆయిల్ ధరలపై పడుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ధరల బాదుడు లేకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికలు రక్షణ కల్పించినా ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే.. అంటే మార్చి ఐదో తేదీ తర్వాత ఒకేసారి పెట్రో సెగ తాగవచ్చు.