iDreamPost
android-app
ios-app

YSRCP Plenary : విద్యా రంగంపై తీర్మానంలో ఏమున్నాయంటే!

  • Published Jul 09, 2022 | 1:56 PM Updated Updated Jul 09, 2022 | 1:56 PM
YSRCP Plenary : విద్యా రంగంపై తీర్మానంలో ఏమున్నాయంటే!

ఉన్న‌త‌మైన‌ చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మిన‌ సీఎం వైఎస్‌ జగన్‌, విద్యకు అధిక‌ ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో, ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, ఇతర ప‌థ‌కాల‌తో ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని న‌మ్మ‌కంగా చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నాని అన్నారు మంత్రి బొత్స‌.

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యారంగంలో మార్పులను ప్ర‌భుత్వం తెచ్చిందన్నారు. ఒకప్పుడు 1 -5వ తరగతి వరకు ఒకే టీచరే. దానివ‌ల్ల పిల్లలకు సరైన చ‌దువు అందేది కాదన్నారు. ఇప్పుడు 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు టీచర్‌తో పిల్లలకు మంచి బోధన అందేలా చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ సంక‌ల్పాన్ని ప్లీన‌రీ ముందుంచారు. రాష్ట్ర విద్యార్థులు ఎక్క‌డికెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేలా తీర్చిదిద్దుతామ‌ని అన్నారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో విద్య భ్ర‌ష్టుప‌ట్ట‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించిన బొత్స‌, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల‌ను ప్రోత్సహించాయని, ఎగ్జామ్స్ లో చూసి రాయించాయని మండిప‌డ్డారు. విద్య‌ను వ్యాపారంగా మార్చి, రిజ‌ల్ట్స్ పేరుతో భారీగా దోచుకున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వ విద్య‌ను ప‌ట్టించుకోకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమ‌ర్శించారు. ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్య అందితే ఆ కుటుంబ ఆర్ధిక‌ స్థితిగతులు మారిపోతాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

ప్ర‌సంగంలో టీచ‌ర్ల‌ను ప్ర‌స్తావించిన మంత్రి బొత్స‌, ఇది స్నేహపూర్వక ప్రభుత్వం, టీచ‌ర్ల‌కు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందని హానిచ్చారు. సీఎం వైఎస్‌ జగన్ మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టిపెట్టార‌ని గుర్తుచేసిన బొత్స‌, నేడు ప్రైవేటు స్కూల్స్‌ను మించి సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నార‌ని ప్ర‌శంసించారు. అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద పథకాలతో బడికి వెళ్లే పిల్లలు పెరిగార‌ని అన్నారు. గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్ లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టి, మన స్టూడెంట్స్ ఎక్క‌డైనా నెగ్గుకురాగల కాన్ఫిడెన్స్ నిచ్చార‌ని చెప్పారు.