పాలనలో పరుగు – వెనుకబడుతున్న పార్టీ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. అణచివేత, అవమానాలు, బెదిరింపులు మధ్య పుట్టిన పార్టీ. 2011 లో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి 2019లో అధికారంలోకి వచ్చేంత వరకు ఎన్నో ఒదిదుడుకులు, మరేన్నో ఆటుపోట్లు పార్టీ చవిచూసింది. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో మొదలైన ప్రస్తానం నేడు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఉన్నతమైన స్థితిలో ఉంది.

తెలుగు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి భారీ మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. తన వయస్సుకు తగినట్లుగానే వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ వినూత్నమైన విధానాలతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నారు. ఇది ఒక ఎత్తు.

ఏ పార్టీకైనా అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యం. వచ్చిన అధికారాన్ని నిలుపుకోవడం తదుపరి లక్ష్యం. మరి వైఎస్సార్‌సీపీ అధినాయకత్తం ఆ వైపుగా అడుగులు వేస్తుందా..? ఒక్క సారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు అధికారం ఉండేలా చేస్తానన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారా..? వాటిని పక్కాగా అమలు చేస్తున్నారా..?

పార్టీ పెట్టిన తర్వాత రెండో సారి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారం చేజిక్కించుకుంది. 175 సీట్లకు గాను ఏకంగా 151 సీట్లును రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. మిగతా 24 చోట్ల పార్టీ అభ్యర్థులు ఓటమిని చవిచూశారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి కారణాలు ఏమిటీ..? అన్న విషయం ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం సమీక్ష చేసిన సందర్భం బహిరంగంగా కనిపించడంలేదు.
ఎన్నికలు ముగిసి, అధికారం చేపట్టి దాదాపు ఏడు నెలలు కావస్తోంది. అయితే ఓడిన 24 నియోజకవర్గాలపై సీఎం జగన్‌ కానీ, వైఎస్సార్‌సీపీ పెద్దలు కానీ సమీక్ష చేయలేదనే చెప్పుకోవాలి. అయా నియోజకవర్గాల్లో ఎందుకు ఓడాం..? కారణాలు ఏమిటి..? అన్న అంశాలు కార్యకర్తలను అడిగి తెలుసుకోవాల్సి ఉంది. అప్పుడే ఆయా లోపాలు, సమస్యలు అధిగమించి పార్టీ విజయతీరాలకు చేర్చొచ్చు.

ఓడిన 24 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఓటమికి భిన్నమైన కారణాలున్నాయి. ఒక్కొక్క చోట పార్టీలో సమన్వయం లోపం, మరొచోట జనసేన అభ్యర్థులు ప్రభావం, మరికొన్ని చోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం లేదా పోటీ అభ్యర్థి బలంగా ఉండడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఉదహారణకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి ఇతర నాయకులు సహకరించకపోవడం వల్ల ఓడిపోయారు. రాజమహేంద్రవరం రూరల్, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన తరఫున బలమైన అభ్యర్థులు పోటీ చేయడంతో వైఎస్సార్‌సీపీ గెలవలేకపోయింది. ఇక ప్రకాశం జిల్లా చీరాల, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపినా ఎన్నికల ముందు వారు పార్టీలోకి రావడంతో గెలుపు పరుగులో వెనకబడ్డారు. ప్రస్తుతం కార్యనిర్వాహక రాజధానిగా చేయనున్న విశాఖపట్నంలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ గెలుపు జెండా ఎగురువేసింది.

ఒక పక్క పరిపాలన, మరో పక్క పార్టీని సమాంతరంగా నడపవలసిన అవసరం ఎంతో ఉంది. కేవలం పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయడం వల్ల మాత్రమే అన్ని వేళలా గెలుపు సాధ్యం కాకపోవచ్చు. ఆ దిశగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆలోచన చేసినా.. అది పార్టీ శ్రేణులకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. తాను కాకపోయినా పార్టీ ముఖ్యనాయకులతో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్ష జరపాల్సిన అవసరం ఎంతో ఉంది.

Show comments