iDreamPost
android-app
ios-app

Ysr Rythu Bharosa, YS Jagan – వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత నేడు

  • Published Jan 03, 2022 | 2:28 AM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
Ysr Rythu Bharosa, YS Jagan – వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత నేడు

వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత సొమ్మును సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేస్తోంది. మొత్తం 50.58 లక్షల మంది రైతులకు రూ.1,036 కోట్లు వారి ఖాతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ రోజు జమ చేసే మొత్తంతో కలిపి 2021-22 సీజనులో రు.6,899.67 కోట్లు జమ చేసినట్టు. గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.72 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.

ఏటా మూడు విడతలుగా సాయం..

వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం ఏటా మూడు విడతలుగా రూ. 13,500 చొప్పున అర్హులైన రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తోంది.

2019 అక్టోబర్ లో ప్రారంభించిన ఈ పథకం కింద తొలి ఏడాది 45 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,162.45 కోట్లు జమ చేశారు. ఈ మొత్తంలో పీఎం కిసాన్ కింద రూ.2,525 కేంద్రం, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.3,637.45 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాయి.

రెండో ఏడాది 2021-21లో49.40 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,750.67 కోట్లు జమ చేశారు. ఇందులో కేంద్రం రూ.2,966 కోట్లు, రాష్ట్రం రూ.3,784.67 కోట్లు అందించాయి. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికి రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమ చేశారు.

Also Read : మనసులు గెలిచావ్‌ జగన్‌

ఈ మొత్తంలో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.3.848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం అందజేశాయి. లబ్ధి పొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు కాగా, 82,251 మంది ఆర్ఓఎఫ్ఆర్- దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులతో పాటు 68,737 మంది కౌలు రైతులు ఉన్నారు.

భూ యజమానులకు రూ.7,500 చొప్పున రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.4 వేలు చొప్పున అందించింది. తొలి రెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలుదారులు , ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు మాత్రం రెండు విడతల్లో రూ.11,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. నేడు జమ చేయనున్న మూడో విడత సొమ్ముతో కలిపి లబ్ధి పొందుతున్న వారిలో 48,86.361 మంది భూ యజమానులు, 82,251 మంది ఆర్ఓఎఫ్ఆర్ – దేవదాయ భూముల సాగుదారులు, 89,877 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాగుదారులు ఉన్నారు.

మాట ఇచ్చిన దాని కన్నా మిన్నగా..

వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లు రూ.67,500 ఇవ్వాలని నిర్ణయించి అమలు చేస్తోంది. ఈ లెక్కన హామీ ఇచ్చిన దాని కన్నా రైతులకు అదనంగా రూ.17,500 చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. ఏటా రైతు భరోసా కింద అందిస్తున్న రూ.13,500ల్లో మొదటి విడత మే నెలలో రూ.7,500, రెండో విడత అక్టోబరు ముగిసేలోపు రూ.4,000, మూడో విడత జనవరిలో రూ.2,000 చొప్పున ప్రభుత్వం క్రమం తప్పకుండా అందజేస్తోంది.

Also Read : వావ్‌.. జగన్‌ ఏం చెప్పారు..! కోటాలు లేవు..! కోతలు లేవు..!!