iDreamPost
android-app
ios-app

YS jagan Davos Tour పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా దావోస్‌కు సీఎం వైఎస్‌ జగన్

  • Published May 20, 2022 | 12:37 PM Updated Updated May 20, 2022 | 12:37 PM
YS jagan Davos Tour పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా దావోస్‌కు సీఎం వైఎస్‌ జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రాయం నుంచి దావోస్‌కు పయనమయ్యారు. నేటి రాత్రికి అంటే శుక్రవారం దావోస్ చేరుకొంటారు. పెట్టుబ‌డుల వేట ల‌క్ష్యంగా సాగే ఈ పర్యటనలో ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో, సీఎంతో పాటు మంత్రులు, అధికారులు బృందం పాల్గొనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొంటారు.

దావోస్ లో సీఎం జ‌గ‌న్ బిజిబిజీగా గ‌డ‌ప‌నున్నారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించి, ఆహ్వానించ‌నున్నారు. పారిశ్రామికీకరణ 4.0 దిశగా రాష్ట్ర‌ప్ర‌భుత్వ వేస్తున్న‌ అడుగులపై దావోస్ లో కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో వివరించనున్నారు. వాటితోపాటు, బెంగళూరు-హైదరాబాద్‌, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. మొత్తం మీద సీఎం జ‌గ‌న్ మూడు కీల‌క స‌మావేశాల్లో పాల్గొన‌నున్నారు.

కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న తమ వ్యూహాన్ని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో సీఎం బృందం వివరించనుంది.

ఇంటర్‌ కనెక్టివిటీ, రియల్‌ టైం డేటా, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఈ దిశ‌గా సాగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. దావోస్‌ సదస్సులో ఏపీ పెవిలియన్‌ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర‌ ప్రభుత్వం. పీపుల్‌-ప్రోగ్రెస్‌-పాజిబిలిటీస్ అన్న‌ది నినాదం.

అధికారాన్ని చేప‌ట్టిన త‌ర్వాత సీఎం తొలిసారి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం, దావోస్ లో ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోనుందో అస‌క్తిక‌రంగా మారింది.