iDreamPost
android-app
ios-app

టీడీపీ నెంబర్‌ 2కు తప్పని భంగపాటు

  • Published Mar 16, 2021 | 4:05 PM Updated Updated Mar 16, 2021 | 4:05 PM
టీడీపీ నెంబర్‌ 2కు తప్పని భంగపాటు

తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడి తరువాత నెంబర్‌ 2గా యనమల రామకృష్ణుడి పేరే చెబుతుంటారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ వాణిని విన్పిస్తున్నారు. పేరుకుతగ్గట్టుగానే యనమల టీడీపీలో తన చక్రం తిప్పేస్తుంటారు. పార్టీలో కీలకంగానే వ్యవహరిస్తున్నప్పటికీ సొంతం ప్రాంత ప్రజల్లో పట్టు కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

యనమల సోదరుడు కృష్ణుడు ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చి తనదైన మార్కు రాజకీయానికి తెరలేపారని ప్రత్యర్ధులు మాత్రం రకరకాలుగా చెప్పుకుంటుంటారు. కానీ తుని పట్టణంలో మంచి పట్టుందని చెప్పుకునే యనమలకు అక్కడ మున్సిపాల్టీలో 30కి 30 వార్డులను వైఎస్సార్‌సీపీ గెల్చుకోవడం కోలుకోలేని దెబ్బగానే పరిశీలకులు పరిగణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పార్టీ నిర్ణయాల్లో సైతం కీలకంగా వ్యవహరించే యనమల తన సొంత ప్రాంతంలో మాత్రం పట్టునిలుపుకోలేకపోవడం తూర్పుగోదావరి జిల్లా రాజకీయవర్గాల్లో గట్టి చర్చనే లేవదీస్తోంది.

తుని మున్సిపాల్టీలో నామినేషన్ల దశలోనే 15 వార్డులు ఏకగ్రీవం అయిపోగా, మిగిలిన 15 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ 15 వార్డుల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు భారీ మెజార్టీలతో విజయదుంధిబి మోగించడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సగం ఓటమిని ముందుగానే యనమల ఒప్పేసుకోవడంతో, మిగిలిన సగం ఓటమిని ప్రజలే ఇచ్చారంటున్నారు.

యనమల కుటుంబం ఒంటెద్దు పోకడల కారణంగానే ప్రజలు వారికి దూరంగా మసలుకుంటున్నారన్న వాదనను పలువురు పరిశీలకులు వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలను చూస్తే పరిశీలకుల అభిప్రాయం నిజమేనన్న భావన కలగకమానదు. పట్టణ ప్రాంత ఓటర్లు నిర్ద్వంద్వంగా యనమల కుటుంబాన్ని తిరస్కరించినట్లుగా స్పష్టమైపోతోంది. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇటువంటి ఫలితాలు వచ్చాయి. 54 పంచాయతీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకోగా, టీడీపీ మూడు పంచాయతీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జోరుకు పలువురు ప్రతిపక్ష నేతల అంచనాలు తల్లకిందులైపోయాయి. అయినప్పటికీ కనీసం ఒకటో అరా సీట్లు దక్కించుకుని పరువునిలుపుకున్నారు. అందుకు పూర్తి భిన్నంగా ఉన్న అన్ని సీట్లు ఎదుటి వాళ్ళు గెల్చేసుకోవడం తునిలో యనమల కుటుంబ హవా మసకబారిపోయిందన్నది స్పష్టం చేస్తోందన్న అభిప్రాయం బలంగానే విన్పిస్తోంది.

టీడీపీ ఏర్పడిన 1983 నుంచి తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలోనూ, పార్టీలో తన పట్టును క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చారు యనమల. ఇది ఏ స్థాయికి చేరిందంటే తుని అంటే యనమల.. యనమల అంటే తుని అన్నరీతిలో సాగిపోయింది. అయితే ఈ అప్రతిహత విజయానికి 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి దాడిశెట్టి రాజా అడ్డుకట్ట వేశారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ నుంచి 2014, 2019లో దాడిశెట్టి రాజా, యనమల సోదరుడు కృష్ణుడుపై విజయం సాధిస్తూ వచ్చారు.

వరుసగా తానే నిలబడ్డానికి బదులు ముఖం మార్చి విజయం పొందేదామనుకున్న యనమల వ్యూహం ఇక్కడ పనిచేయలేదు. దీంతో ఓటమి తప్పలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం ఘోర పరాజయం ఎదురు కావడంతో తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలతో పాటు, రాష్ట్రస్థాయిలో తెలుగుదేశం పార్టీలోనూ యనమల రామకృష్ణుడు భవిష్యత్తు ఏంటన్నది కాలమే తేల్చాల్సి ఉందంటున్నారు.