iDreamPost
android-app
ios-app

వైసీపీదే మైదుకూరు మున్సిపాలిటీ.. పోటీకి ముందే చేతులెత్తేసిన టీడీపీ..

వైసీపీదే మైదుకూరు మున్సిపాలిటీ.. పోటీకి ముందే చేతులెత్తేసిన టీడీపీ..

వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ అధికార వైసీపీ వసమైంది. గడచిన మున్సిపల్‌ ఎన్నికల్లో 11 కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు గాను టీడీపీ అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరుల్లోనే చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించింది. తాడిపత్రిలో 36 వార్డులకు గాను 18, మైదుకూరులో 24 వార్డులకు గాను 12 వార్డులను టీడీపీ గెలుచుకుంది. వైసీపీ 11 వార్డులు, ఒక వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు.

ఏ పార్టీకి ఆధిక్యం రాకపోవడంతో తాడిపత్రి, మైదుకూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. తాడిపత్రిలో 36 వార్డులకు గాను టీడీపీ 18, వైసీపీ 16, సీపీఐ, స్వతంత్రులు ఒక్కొక్క స్థానంలో గెలుపొందారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్ధతుతో అక్కడ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని గెలుచుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది.

అయితే మైదుకూరులో చైర్మన్‌ ఎన్నికకు ముందే టీడీపీ చేతులెత్తేసింది. చైర్మన్‌ పీఠాన్ని గెలుచుకునే బలం లేకపోవడంతో ఎన్నికకు దూరంగా ఉంది. ఈ రోజు జరిగిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి కూడా టీడీపీ తరఫున గెలిచిన వారు హాజరుకాలేదు. మైదుకూరు ఎమ్మెల్యే, కడప ఎంపీల ఎక్స్‌ అఫిషియో ఓట్లతో వైసీపీ చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ కన్నా ఒక వార్డును ఎక్కువగా గెలుచుకున్నా.. చైర్మన్‌ పీఠం దక్చించుకునే బలం లేకపోవడంతో టీడీపీ పోటీకి పూర్తిగా దూరంగా ఉంది.

వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా లక్ష్మీదేవి, జమ్మలమడుగు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా చేనేత సామాజికవర్గానికి చెందిన వేల్పుల శివమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 41 వార్డులకు గాను వైసీపీ 39 గెలుచుకోగా.. టీడీపీ ఒక వార్డు, స్వతంత్ర అభ్యర్థి మరో వార్డులో గెలిచారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా.. వైసీపీ 18 వార్డులను కైవసం చేసుకోగా.. బీజేపీ 2 వార్డులను గెలుచుకుంది.

Also Read : ఆశ్చర్యకరంగా మైదుకూరు ఫలితం