Idream media
Idream media
గడచిన సాధారణ ఎన్నికల్లో ఎలా ఓడిపోయామో.. అని తమకు తామే ప్రశ్నించుకున్న పసుపు సైన్యం అధినేత చంద్రబాబు, ఇతర నేతలు అందరి నోళ్లలో నానారు. ఈ మాట చెప్పడంతోపాటే.. నువ్వెలా ఓడిపోయావయ్యా.. అంటూ కృష్ణ కరకట్ట లోపల ఉన్న చంద్రబాబును ఓదార్చే కార్యక్రమం రోజుల తరబడి సాగింది. చంద్రబాబుకు సామాన్య ప్రజలు ఇచ్చిన ఓదార్పును టీడీపీ అనుకూల మీడియా ప్రముఖంగా ప్రచురించింది. తద్వారా అయ్యో.. బాబు ఓడిపోయాడని అందరూ బాధపడుతున్నారనే ఆలోచనను ప్రజల్లో రేకెత్తించే ప్రయత్నం చేశారు. దీని వల్ల ఆశించినంత ఫలితం రాకపోవడంతో బాబు అండ్ కో వాస్తవంలోకి వచ్చారు.
ఇప్పటికీ టీడీపీ ఓటమికి గల కారణాలను స్పష్టంగా చెప్పని చంద్రబాబు అండ్‌కో.. ప్రజలు మాత్రం ఓటు వేయలేదని మాత్రం చెబుతున్నారు. తమకు ఆది నుంచి అండగా ఉన్నా బీసీలు దూరం అయ్యారని బాబు సహా ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలైన యనమల రామకృష్ణుడు, కింజారపు అచ్చెం నాయుడు సహా తదితర నేతలు ఒప్పుకున్నారు. తిరిగి బీసీలను మళ్లీ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా.. బీసీలతో ముడిపెట్టి మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అదే సమయంలో బీసీలకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాజకీయ పరమైన విధానాలపై విమర్శలు చేస్తున్నారు.
యాధృచ్చింగా జరిగిందో లేక బీసీలకు కార్పొరేషన్లు పెట్టడం వల్ల జరిగిందో గానీ టీడీపీలో వివిధ విభాగాలకు నేతలను బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ప్రకటించిన సమయంలోనే నియమించారు. బీసీలకు ప్రభుత్వంలో పదవులు ఇచ్చామంటూ వైసీపీ నేతలు ప్రకటించగా.. టీడీపీ నేతలు మాత్రం తమ పార్టీలో అత్యధిక శాతం పదవులు బీసీలకు ఇచ్చామంటూ పోటీ ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ సీనియర్‌నేత అయిన యనమల రామకృష్ణుడు కూడా తనదైన శైలిలో ప్రకటన విడుదల చేశారు. టీడీపీ సంస్థాగత కమిటీల్లో బీసీలకు పెద్దపీట వేయడంతో టీడీపీ బీసీల పార్టీ అని రుజువైందంటూ యనమల చెప్పుకొస్తున్నారు. పైగా చంద్రబాబుకు ధన్యావాదాలు కూడా తెలిపారు.
పార్టీలో పదవులు ఇచ్చినందుకే టీడీపీ బీసీల పార్టీ అయితే.. మంత్రివర్గంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాంత మంత్రిపదవులు, 56 బీసీ కార్పొరేషన్ల ద్వారా 729 చైర్మన్, డైర్టెక్టర్ పోస్టులు, వ్యవసాయ కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు, అనేక సంక్షేమ పథకాల ద్వారా 2.71 కోట్ల మంది బీసీలకు 33 వేల కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చిన వైసీపీది ఎవరి పార్టీ అని చెప్పుకోవాలో సెలవియ్యాలని యనమలను వైసీపీ నేతలు కోరుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు ఇవ్వడం గొప్ప విషయమా..? లేక బీసీ సామాజికవర్గ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి, నేతలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వడం గొప్ప విషయమా..? మేధావి అని అనిపించుకునే యనమలకు వైసీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు.